Telugu Gateway
Politics

మన్మోహన్ ను మించిన ‘మౌనమునిలా మోడీ’

మన్మోహన్ ను మించిన ‘మౌనమునిలా మోడీ’
X

మౌనముని. ఇది యూపీఏ హయంలో ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ కు పెట్టిన పేరు. ఆయన జమానాలో ఎంత పెద్ద కుంభకోణం జరిగినా..ఎంత పెద్ద సమస్య తలెత్తినా ఆయన పెద్దగా స్పందించేవారు కాదు. ఈ అంశాన్ని అప్పట్లో బిజెపి రాజకీయంగా వాడుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుమార్లు మన్మోహన్ సింగ్ ను మౌనమునిగా అభివర్ణించారు. కానీ పరిస్థితులు తారు మారు అయ్యాయి. యూపీఏ ప్రభుత్వం పోయి...ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా ఎంచక్కా లండన్ చెక్కేశారు. ప్రభుత్వ సాయం లేకుండా ఓ నిందితుడు ఇలా విదేశాలకు ఎగిరిపోవటం ఏ మాత్రం సాధ్యంకాదనే విషయం బహిరంగ రహస్యం. విజయ్ మాల్యా వ్యవహారం ఇంకా ఏ మాత్రం మర్చిపోక ముందే దాన్ని తలదన్నేలా పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)లో అంతకంటే పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశంలోనే ప్రముఖ వజ్రాల వ్యాపారిగా ఉన్న నీరవ్ మోడీ ఈ బ్యాంకును ఏకంగా 12 వేల కోట్ల రూపాయల వరకూ ముంచారు.

బ్యాంకు అధికారులతో కుమ్మక్కు అయి ఈ దోపిడీకి పాల్పడి...ఆయన కూడా జనవరిలో హాయిగా విదేశాలకు చెక్కేశారు. దీనికీ ప్రభుత్వ సహకారం ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలాంటిదే మరొకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నీరవ్ మోడీ తరహాలోనే రోటామాక్ కంపెనీ అధినేత కొఠారి కూడా కన్పించకుండా పోయారు. ఆయన కూడా ఏకంగా బ్యాంకులకు 800 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టారని ప్రస్తుతానికి లెక్కతేల్చారు. నీరవ్ మోడీ నేరుగా పీఎన్ బిని ముంచగా...కొఠారి మాత్రం అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు టోపీ పెట్టినట్లు సమాచారం. దేశ బ్యాంకింగ్ రంగంలో అల్లకల్లోలం జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ మాత్రం నోరెత్తి మాట్లాడటం లేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు..ఏ సంక్లిష్ట అంశం ఉన్నా..మోడీ కూడా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. మన్మోహన్ సింగ్ స్వతహాగా మితభాషి. కానీ నరేంద్రమోడీ అలా కాదు. ఆయన తనకు కావాల్సిన అంశాలపై అనర్గళంగా స్పీచ్ లు ఇచ్చేసి..తాను ఇబ్బంది పడే అంశాలను మాత్రం చాలా కన్వీనెంట్ గా వదిలేస్తున్నారు. ఎప్పుడో అంతా సద్దుమణిగిన తర్వాత మాత్రం చాలా తీరిగ్గా మాట్లాడతారు.

Next Story
Share it