Telugu Gateway
Andhra Pradesh

జగన్ సవాల్ కు పవన్ సై

జగన్ సవాల్ కు పవన్ సై
X

ఏపీ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ కోరినట్లు మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టడానికి తాము రెడీ అని..దీనికి పవన్ తన మిత్రపక్షం తెలుగుదేశం మద్దతు సాధిస్తారా? అని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ సోమవారం మీడియా సమావేశం పెట్టి మరీ స్పందించారు. జగన్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని..తాను టీడీపీకి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చానే కానీ..తనకు ఆ పార్టీతో ఏ మాత్రం సంబంధం లేదన్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ వైఖరి ఏంటో కూడా తేలిపోతుంది కదా? అని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వటానికి ఒక్క ఎంపీ చాలు అని..జగన్ ఆ పని చేయిస్తే తాను 80 మంది ఎంపీల మద్దతు సాధించుకొస్తానని తెలిపారు. మోడీని చూసి టీడీపీ, వైసీపీ భయపడుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని..తనకు అదే అనుమానం కలుగుతోందని అన్నారు.

తాను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీకి దమ్ము, ధైర్యం ఉందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ క్రెడిట్ వైసీపీ నేతలే పొందవచ్చని వ్యాఖ్యానించారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే దీనికి అవసరమైన ఎంపీల మద్దతు కూడకట్టడానికి తాను తమిళనాడు, కర్ణాటక వెళ్ళటంతో పాటు ఢిల్లీ కూడా వెళతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు కలిస్తే 25 మంది అవుతారని..టీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీ నాయకుల సాయం కోరతామని తెలిపారు. గుంటూరులో సభ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు కూడా ఏపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారని..ఇప్పుడు వారి మద్దతు కోరతామని తెలిపారు.

Next Story
Share it