Telugu Gateway
Politics

సవాల్ పై కెటీఆర్ వెనక్కితగ్గినట్లేనా!

సవాల్ పై కెటీఆర్ వెనక్కితగ్గినట్లేనా!
X

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రాజకీయ సన్యాసం సవాల్ పై తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ వెనక్కిపోయారా?. వాతావరణం చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంతా తమవైపే ఉందని..ఉత్తర తెలంగాణలోనూ ఫిఫ్టీ ఫిట్టీ అంటూ ప్రకటించారు. ఇది అధికార టీఆర్ఎస్ నేతలకు చికాకు తెప్పించింది. అంతే అందరూ కాంగ్రెస్ సర్వే భోగస్ అంటూ ఎదురుదాడి చేశారు. మంత్రి కెటీఆర్ అయితే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని..కెసీఆరే సీఎం అవుతారని..కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని బహిరంగ సవాల్ విసిరారు. ఉత్తమ్ కంటే వయస్సులో తాను చాలా చిన్నవాడినని ..అయినా రాజకీయ సన్యాసానికి సిద్ధం అని సవాల్ విసిరారు. ఎంపీ కవిత అయితే తమకు వంద సీట్లు వస్తాయని..అందరూ కలసినా తమకు ఏమీకాదన్నారు. కెటీఆర్ సవాల్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతే ధీటుగా స్పందించారు.

వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాకపోతే తాను ఒక్కడినే కాదు...ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య కూడా రాజకీయాలు వదిలేస్తారని ప్రకటించారు ఉత్తమ్. అంతే కాదు..ఈ సవాల్ పార్టీ అధినేత కెసీఆర్ నుంచి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి హామీలు టీఆర్ ఎస్ నుంచి చాలానే వచ్చాయని తెలంగాణ తొలి సీఎం దళితుడిని చేస్తానని..తాను మాట ఇస్తే తల నరుక్కొంటానే కానీ..మాట తప్పనని కెసీఆర్ ప్రకటించిన అంశాన్ని గుర్తుచేశారు ఉత్తమ్. అంతే మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని హామీలను కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ నుంచి ఊహించని స్థాయిలో కెటీఆర్ సవాల్ కు రియాక్షన్ రావటంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇరకాటంలో పడిపోయాయి. కెటీఆర్ సవాల్ కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయినా ఇంత వరకూ టీఆర్ఎస్ నుంచి కనీస స్పందన లేకపోవటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కెటీఆర్ సవాల్ కూడా అనువు కాని సమయంలో చేసి..ఇరుక్కున్నట్లు అయిందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుకెళ్లినా ఇబ్బందే..వెనక్కితగ్గినా రాజకీయంగా ఇబ్బంది ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it