Telugu Gateway
Movie reviews

‘గాయత్రి’ మూవీ రివ్యూ

‘గాయత్రి’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లో మోహన్ బాబుది ఓ విలక్షణ శైలి. చాలా గ్యాప్ తర్వాత ఈ హీరో ద్విపాత్రిభినయంతో ముందుకొచ్చాడు. అదీ సొంత బ్యానర్ లో. ఈ సినిమాలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా నటించాడు. కాకపోతే ఇది ఓ గెస్ట్ ఆర్టిస్ తరహా పాత్రే. ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో వంటి వినూత్న చిత్రాలను తెరకెక్కించిన మదన్‌ తొలిసారిగా తన స్టైల్‌ మార్చి థ్రిల్లర్ జానర్‌ సినిమాను తెరకెక్కించారు. మరి మోహన్ బాబు, మదన్ లకు విజయం అందిందా? లేదా తెలుసుకోవాలంటే మరింత ముందుకెళ్ళాల్సిందే. ఇక సినిమా కథ విషయానికి వస్తే దాసరి శివాజీ (మోహన్‌ బాబు) రంగస్థల నటుడు. చిన్నప్పుడే ఆయనకు కూతురు దూరం అవుతుంది. ఎప్పటికైనా తప్పిపోయిన తన కూతురు తన వద్దకు చేరుకుంటుందనే నమ్మకంతో ముందుకు సాగుతుంటాడు. అందులో భాగంగా కొంత మంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు.

తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకు డబ్బు సాయం చేస్తుంటాడు. శివాజీ మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్‌ శ్రేష్ఠ (అనసూయ) మారువేషాల్లో అతడు చేసే పని ఎలాగైనా బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్‌ (మోహన్‌ బాబు), శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్‌. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్‌.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు..? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏంటి..? అన్నది వెండితెరపై చూడాల్సిందే.

చాలా కాలం తరువాత మోహన్‌ బాబు ను పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ లో చూపించిన మదన్ అభిమానులను మెప్పించాడు. అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్‌ సాంగ్స్ ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడతాయి. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తమన్ సంగీత మందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. గాయత్రి పటేల్ రోల్ లో మోహన్ బాబు నెగిటివ్ రోల్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడని చెప్పొచ్చు. ఓవరాల్ చూస్తే గాయత్రి సినిమాను గాయత్రి పటేల్ లో మోహన్ బాబు పాత్ర కోసం సినిమా చూడొచ్చు.

రేటింగ్. 2.75/5

Next Story
Share it