Telugu Gateway
Politics

భాగస్వామ్య సదస్సు...చంద్రబాబు బోగస్ లెక్కలు

భాగస్వామ్య సదస్సు...చంద్రబాబు బోగస్ లెక్కలు
X

ఎక్కడా లక్షల కోట్ల పెట్టుబడులకు తగ్గేది లేదు. ఉద్యోగాల్లోనూ ఏ మాత్రం వెనకంజ వేసేదిలేదు. భాగస్వామ్య సదస్సు పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకునే బోగస్ ప్రచారం చూసి అధికార వర్గాలు కూడా అవాక్కు అవుతున్నాయి. 2016లో జరిగిన భాగస్వామ్య సదస్సులో 331 ఎంవోయులు జరిగాయి. 4.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. మళ్ళీ 2017లోనూ భాగస్వామ్య సదస్సు జరిగింది. అప్పుడూ 665 ఎంవోయులు జరిగాయి. 10.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అక్కడ 11 లక్షల ఉద్యోగాల లెక్క చెప్పారు. సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో 58 శాతం వరకూ రియలైజ్ అవుతున్నాయి అని. ఈ లెక్కన చూస్తే 2016,2017 సంవత్సరాల్లో జరిగిన ఎంవోయుల మొత్తం విలువ సుమారు 15 లక్షల కోట్ల రూపాయల పైమాటే.

కనీసం 50 శాతం అమలు అయినా కూడా ఏపీలో ఇప్పుడు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల అమలు వివిధ దశల్లో ఉండాలి. 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం సగం వేసుకున్నా పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చి ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అటు పెట్టుబడులు మొదలుకుని..ఉద్యోగాలకు సంబంధించి కూడా అన్నీ బోగస్ లెక్కలే అని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్తగా 2018 భాగస్వామ్య సదస్సులో 734 ఎంవోయులు చేసుకోగా...వీటి ద్వారా 4.39 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని లెక్కలేశారు. గత మూడేళ్ల ఈ ఎంవోయులు చూసుకుంటే ఈ మొత్తం సుమారు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లే ఇందులో సగం గ్రౌండ్ అయినా కూడా అసలు కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, హోదా ఏమీ అవసరం ఉండదని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

అయితే ఏపీకి పెట్టుబడుల వెల్లువ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ల కృషి వల్లే అని మీడియాలో ఫుల్ కలరింగ్ ఇచ్చేసుకుంటున్నారు. అటు సీఎంవో మీడియా సమాచారాల్లో కానీ..లోకేష్ కార్యాలయం మీడియా రిలీజుల్లో కానీ ఎక్కడ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాధ్ రెడ్డి పేరు కనీసం నామమాత్రంగా కూడా ప్రస్తావించటం లేదు. భాగస్వామ్య సదస్సులో మంత్రి భాగస్వామ్యం బాగానే ఉన్నా..అటు సీఎం చంద్రబాబు కానీ..ఇటు మంత్రి లోకేష్ లు బోగస్ లెక్కల క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ లెక్కలు చెప్పి ప్రభుత్వమే ఏపీ ప్రజలను భ్రమల్లో ఉంచుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it