Telugu Gateway
Andhra Pradesh

జగన్ తో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారా!

జగన్ తో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారా!
X

‘రాజా ఆఫ్ కరప్షన్’. లక్ష కోట్ల రూపాయల అవినీతి. పక్కా ఆధారాలు ఇవిగోండి. అవినీతి ఆధారాలకు ఏకంగా పుస్తకరూపం ఇఛ్చింది తెలుగుదేశం పార్టీ. అంతే కాదు..ఢిల్లీలో జాతీయ పార్టీ నాయకులు అందరికీ ఆ పుస్తకాలు పంపిణీ చేసింది. దేశంలోనే ఇంత భారీ ఎత్తున అక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పింది. తాము అధికారంలోకి వస్తే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమార్జనను రూపాయితో సహా కక్కిస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని టీడీపీ నేతలు అందరూ హుంకరించారు. సాగునీటి శాఖలో కుంభకోణం ఇది..ఎస్ఈ జెడ్ ల్లో కుంభకోణం, విద్యుత్ ప్రాజెక్టుల్లో కుంభకోణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (ఎస్ఈజెడ్) భూ కేటాయింపుల్లో కుంభకోణం, గనుల కేటాయింపుల్లో స్కామ్ ఇవిగో ఆధారాలు అంటూ సీబీఐ విచారణ కంటే పక్కాగా ‘లెక్కలు కట్టి మరీ’ చెప్పారు. అక్రమాస్తుల స్వాధీనం చేసుకోవటానికి ప్రత్యేక చట్టం తెస్తున్నట్లు మరీ ప్రకటించారు చంద్రబాబు. కానీ ఇంత వరకూ ఆ దిశగా అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతిని ఆధారాలతో సహా పుస్తకరూపంలో ముద్రించిన తెలుగుదేశం పార్టీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క స్కామ్ లో కూడా జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది.

పోనీ జగన్ అండ్ కో కు సహకరించిన ఒక్కరంటే ఒక్క అధికారిపై అయినా చర్యలు తీసుకున్నారా?. అంటే అదీ లేదు. పైగా ఒకప్పుడు నవయుగా ప్రాజెక్టుల్లో జగన్ కు వాటాలు ఉన్నాయని ప్రకటించిన తెలుగుదేశం నేతలు..ఇప్పుడు అదే కంపెనీతో కలసి అక్రమ దందాలు సాగిస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉండగా పుస్తకరూపంలో చంద్రబాబు చెప్పిన జగన్ అవినీతి లెక్కలు తప్పా?. లేక ప్రస్తుతం తాము అధికారంలో ఉండి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నందున వాటి గురించి పట్టించుకునే తీరిక లేదా?. లేక లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పిన జగన్ తో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమ్మక్కు అయ్యారా?. లేకపోతే పుస్తకరూపంలో ముద్రించి..ఆధారాలు ఉన్న తర్వాత కూడా చంద్రబాబు అక్రమార్కులపై చర్యలు తీసుకోవటం లేదంటే కారణం ఏమై ఉంటుంది?. అవినీతికి ఆధారాలు పుస్తకరూపంలో చూపించిన చంద్రబాబు ఇప్పుడు వాటిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు. పాత అవినీతితో కొత్త అవినీతి చెల్లు అని ‘సర్దుబాటు’ చేసుకుంటున్నారా?. ప్రజలకు అయితే క్లారిటీ ఇవ్వాలి కదా?.

Next Story
Share it