Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఏది అంటే...అందరూ అదే అనాలి

చంద్రబాబు ఏది అంటే...అందరూ అదే అనాలి
X

‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చితే మీకు నచ్చాలి. చంద్రబాబుకు నచ్చకపోతే మీకు నచ్చకూడదు. చంద్రబాబు వ్యతిరేకిస్తే ..మీరు వ్యతిరేకించాలి. చంద్రబాబు అనుకూలంగా ఉంటే మీరు అనుకూలంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బాధ చంద్రబాబు బాధ కావాలా?.చంద్రబాబు బాధ ఏపీ బాధ కావాలా?.’ ఇవీ తెలుగుదేశం లీడర్లు...క్యాడర్ ను గందరగోళ పరుస్తున్న అంశాలు. ఎవరికీ సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఉన్నా కూడా అవి బయటకు చెప్పకూడదు. తెలుగుదేశం నేతలు అచ్చం అదే పని చేస్తున్నారు. దీనికి ఎంపిక చేసిన మీడియా మద్దతు కూడా కావాల్సినంత. హోదా రాదని తెలిసినప్పుడు ప్యాకేజీ కూడా వద్దంటే విభజన సమయంలో నష్టపోయినట్లే నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించిన పెద్దలు కొంత మంది. ఇప్పుడు ప్యాకేజీలో ఏమీలేదంటూ టీడీపీతో పాటే కొత్తరాగాలు. చంద్రబాబు ప్రత్యేక హోదా వేస్ట్ అంటే అందరూ కోరస్ గా హోదా వేస్ట్..వేస్ట్ అన్నారు. ప్యాకేజీ బెస్ట్ అంటే ..ఎంతైనా బాబు మాటే మా బాట కదా అని దీనికి వంత పాడేశారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ‘ప్రత్యేక హోదా’ హామీ రాజ్యసభలో ఇచ్చారు. హోదా కోసం కాంగ్రెస్, వామపక్షాలతో పాటు వైసీపీ బంద్ కు పిలుపిస్తే ప్రభుత్వం దగ్గరుండి బంద్ ప్రయత్నాలను విఫలం చేసింది.

ప్యాకేజీతో హోదా కంటే ఎక్కువ లాభాలొస్తాయని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నానాయాగీ చేసినా కేంద్రం పెద్దగా దిగొచ్చింది లేదు. అన్నీ పాత పాటలే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో టీడీపీ వాదన సమర్థవంతంగా విన్పించారు. అంత వరకూ ఓకే. వాదన సమర్థవంతంగా విన్పించటం వేరు. సాధించుకోవటం వేరు. బాగా మాట్లాడినందుకు సన్మానాలు చేసుకుంటారా?. ప్యాకేజీ ప్రకటించినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి సన్మానాలు చేసి హంగామా చేసిన తరహాలోనే ఉంది ఈ వ్యవహారం కూడా. ఈ తతంగం అంతా చూస్తుంటే చంద్రబాబు కేంద్రం విషయంలో కావాల్సినంత రచ్చ చేసి చివరి నిమిషంలో బయటకు వచ్చి తప్పంతా..బిజెపిదే తప్ప...ఇందులో తన పాత్రేమీలేదని చెప్పి తప్పించుకునే ప్లాన్ కన్పిస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఏపీలో పెద్దగా ప్రభావం లేని బిజెపి కంటే ఇది ఎక్కువగా అధికార టీడీపీకే నష్టం చేయటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it