Telugu Gateway
Andhra Pradesh

అబ్బో..ఐఏఎస్ లపై చంద్రబాబుకు ఎంత ప్రేమో!

అబ్బో..ఐఏఎస్ లపై చంద్రబాబుకు ఎంత ప్రేమో!
X

నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో అత్యంత కీలకమైన ఐఏఎస్ లకు విలువ ఇస్తున్నారా?. ఫైళ్ళలో వాళ్ళు చెప్పిన మాటలను పాటిస్తున్నారా?. అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. తన సొంత ప్రభుత్వంలో పనిచేసే అత్యంత కీలకమైన అధికారులు చేసిన సూచనలను బేఖాతరు చేసిన సందర్భాలు ఎన్నో!. పోనీ ఒకటీ అరా విషయాల్లో అంటే ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం అలా చేశారనుకోవచ్చు. అందులో కొంతలో కొంత అర్థం ఉంటుంది కూడా. కానీ చంద్రబాబు ఐఏఎస్ లు విభేధించిన నిర్ణయాలు అన్నీ కూడా కాంట్రాక్టర్లకు..ప్రైవేట్ సంస్థలకు మేలు చేసి పెట్టేవే. సాక్ష్యాత్తూ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినేష్ కుమార్ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒఫ్పందాల వల్ల సర్కారుపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతుందని తేల్చిచెప్పారు. ఈ ఒప్పందాలు ఆమోదించవద్దని ఫైలులో రాశారు. మరో ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ కూడా అదే పని చేశారు. అయినా సరే అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా చంద్రబాబునాయుడు మాత్రం ఐఏఎస్ అధికారులు వ్యతిరేకించిన నిర్ణయాలను కేబినెట్ లో పెట్టి ఆమోదింపచేసుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు పదుల సంఖ్యలోనే ఉంటాయి.

ఏపీకి అత్యంత కీలకమైన రాజధాని అమరావతి విషయంలోనూ స్విస్ ఛాలెంజ్ విధానంపై తొలుత కొంత మంది అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే డోంట్ కేర్ అంటూ సీఎం చంద్రబాబు ముందుకే వెళ్ళారు?. మొన్నటికి మొన్న ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కే అప్పగించాలని సిఫారసు చేసింది. అయినా సరే..పట్టించుకోని చంద్రబాబు కేబినెట్ ముందు పెట్టి..ఐఏఎస్ లు చేసిన సిఫారసులను తోసిపుచ్చారు. ఏకంగా ఏఏఐకి వచ్చిన టెండర్ నే రద్దు చేశారు. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాల పెంపు ప్రతిపాదనలు అయితే లెక్కలేనన్ని. అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే...తన అక్రమాలు అన్నింటికీ చంద్రబాబు ‘కేబినెట్’తో ఆమోదముద్ర వేయించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అన్ని విభాగాల్లో ఉన్నట్లే ఐఏఎస్ ల్లోనూ మంచివాళ్ళు ఉంటారు....అక్రమార్కులు ఉంటారు. కానీ రాష్ట్ర ప్రజలకు పనికి వచ్చే పనులను నిజంగా ఐఏఎస్ లు అడ్డుకుంటారా?. అలా అడ్డుకోవటం వల్ల వారికి ఏమి లాభం వస్తుంది?.. అంటే ఎక్కువ శాతం ఐఏఎస్ అధికారులు ప్రజలకు పనికొచ్చే పనులను అడ్డుకోవటానికి సాహసించరు. మరీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండి..అడ్డంగా బుక్కవుతామని కుంటే తప్ప..ఓకే చేస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు అడ్డంగా వ్యతిరేకించినా సరే..కేబినెట్ అనే ముసుగులో తన దోపిడీని యధేచ్చగా కొనసాగిస్తున్నారు. సాక్ష్యాత్తూ చంద్రబాబు కేబినెట్ లోని మంత్రి ఆదినారాయణరెడ్డి ఇద్దరు ఐఏఎస్ లను పక్కన పెట్టుకుని సెటిల్ మెంట్లు చేశారనే విషయం చెప్పారు. ఐఏఎస్ లు విభేదించిన ఎన్ని ఫైళ్ళను కేబినెట్ లో పెట్టి చంద్రబాబు అడ్డంగా ఆమోదింపచేసుకున్నారో ఓ సారి లెక్కచూస్తే అసలు విషయాలు బహిర్గతం అవుతాయి.

Next Story
Share it