Telugu Gateway
Andhra Pradesh

‘అఖిలపక్షం’ పేరుతో చంద్రబాబు అసలు ప్లాన్ అదే

‘అఖిలపక్షం’ పేరుతో చంద్రబాబు అసలు ప్లాన్ అదే
X

‘అంతా మా ఇష్టం. అంతా మా ఇష్టం. ఎవరెన్ని విమర్శలు చేసినా డోంట్ కేర్. అది అమరావతికి శంకుస్థాపన అయినా..ఏ కార్యక్రమం అయినా మా ఇష్టం వచ్చినట్లే చేస్తాం. ’ ఇదీ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. పలుమార్లు రాజకీయపక్షాలు అఖిలపక్ష సమావేశాలు..శ్వేతపత్రాలు డిమాండ్ చేసినా చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం తాను నిండా మునిగే సమయం వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అఖిలపక్షం’ జపం చేయటం ప్రారంభించారు. అందరినీ పిలిచి మాట్లాడతానని ప్రకటించారు. ప్రత్యేక హోదా వ్యవహారం తన మెడకు చుట్టుకోవటం ఖాయంగా కన్పిస్తుండటంతో...ఈ వ్యవహారాన్ని అందరికీ సమాన వాటాగా పంచేందుకు చంద్రబాబు ఈ కొత్త ఎత్తు వేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కొద్ది కాలం క్రితం వరకూ అసలు ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన చంద్రబాబు..ఇప్పుడు మళ్ళీ ఆ పాట ఎత్తుకుంటున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందో లేక ప్రత్యేక హోదాకు సమానంగా సాయం చేస్తారో తేల్చుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎంపీల రాజీనామా ఒకెత్తు అయితే...మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే ఎన్డీయేపై ‘అవిశ్వాసం’ పెట్టాలని చేసిన వ్యాఖ్యలు ఆగ్నికి అజ్యం పోసినట్లు అయ్యాయి. గత ఎన్నికల్లో కలసి పోటీచేసింది బిజెపి, టీడీపీ. ఎవరైనా ప్రత్యేక హోదా కేంద్రాన్ని అడగాలి కానీ..తమను అడగకూడదట. ఇదీ చంద్రబాబు వితండవాదన. రెండు పార్టీలూ అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు కొనసాగుతాయి. కానీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రం కేంద్రాన్నే ప్రశ్నించాలట.

పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో మొదలుపెట్టిన వ్యవహారం ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వేడి రాజేసింది. ఎన్నికల ఇంకా సమయం ఏడాది కూడా లేకపోవటంతో చంద్రబాబు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కేంద్రంలో బిజెపిని గట్టిగా నిలదీయలేని పరిస్థితి. మరో వైపు ఏపీలో విపక్షాల మూకుమ్మడి దాడి. కలసి ఉండీ ఏమీ సాధించలేని స్థితి. అందుకే ఇప్పుడు చంద్రబాబు సమస్య తన వరకూ వచ్చేసరికి తొలిసారి అఖిలపక్షం పేరుతో అందరినీ భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాసం డిమాండ్ పెట్టింది పవన్ కళ్యాణ్. దీనికి ప్రతిపక్ష వైసీపీ సై అంటోంది. జనసేన ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం నో అంటోంది. మరి టీడీపీ తీరుపై ఇప్పుడు పవన్ ఏమంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it