Telugu Gateway
Movie reviews

ఛ‌లో మూవీ రివ్యూ

ఛ‌లో మూవీ రివ్యూ
X

నాగ‌శౌర్య‌. హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ‌హీరో. ఈ సారి ప‌క్కా ప్లానింగ్ తో ..కాన్పిడెంట్ గా ఛ‌లో అంటూ ముందుకొచ్చాడు. అదీ సొంత బ్యాన‌ర్ లోనే ఈ సినిమా చేశాడు. మాస్ మ‌హారాజా ర‌వితేజ సినిమా ట‌చ్ చేసి చూడు ఉన్నా ఏ మాత్రం వెర‌వ‌కుండా అదే రోజు సినిమా విడుద‌ల చేశాడు. స‌హ‌జంగా పెద్ద పెద్ద హీరోలే డేట్లు స‌ర్దుబాటు చేసుకుని ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్ళ‌తో బండి లాగించాల‌ని చూస్తున్నారు. ఈ త‌రుణంలో నాగ‌శౌర్య ధైర్యం మెచ్చుకోవాల్సిందే. మ‌రి ఛ‌లో అంటూ దూసుకొచ్చిన నాగ‌శౌర్య సినిమా ఎలా ఉందో ఓ లుక్కేయండి. హరి( నాగశౌర్య )కి బాల్యం నుంచే ఫైటింగ్ అంటే ఇష్టం. అది కొట్ట‌డం అయినా..కొట్టించుకోవ‌టం అయినా. అదేంటి అంటారా? అది అంతే. ఈ త‌ర‌హా కొత్త కాన్సెప్ట్ తో వ‌చ్చాడు మ‌రి.

అలా మొద‌లైన ఫైటింగ్ సీన్లు చివ‌రికి ఆ ఫ్యామిలీకి పెద్ద త‌ల‌నొప్పిగా మార‌తాయి. తన కొడుకు గొడవలకు దూరంగా ఉండాలంటే గొడవలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో పెడితే మారతాడని అనుకుంటాడు న‌రేష్‌. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో తిరుప్పురు అనే గ్రామంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకే వెతికి మ‌రీ అక్కడి కాలేజీలో జాయిన్‌ చేస్తాడు.

ఆ కాలేజ్‌లోనే కార్తీక(రష్మిక మందన)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు హరి. మ‌రి నిత్యం గొడ‌వ‌లు జ‌రిగే ఊర్ల మ‌ధ్యకు వ‌చ్చిన హ‌రి గొడ‌వ‌ల‌కు పుల్ స్టాప్ పెడ‌తాడా?. అంద‌రూ క‌ల‌సి ఉండాల‌ని ఎందుకు కోర‌కుంటాడు అన్న‌ది వెండితెర‌పై చూడాల్సిందే.

ఆ ఊరి గొడ‌వ‌ల‌కు త‌న ప్రేమికురాలు కార్తీక‌కు ఉన్న సంబంధం ఏంటి అన్న ట్విస్టులు సినిమాలో ఆస‌క్తిని రేపుతాయి. ఈ సినిమాలో నాగ‌శౌర్య ఫుల్ ఎన‌ర్జీ చూపించాడు. అత‌ని న‌ట‌న‌కు ఫుల్ మార్కులు ప‌డిపోతాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ర‌ష్మిక మందానికి కూడా ఫైటింగ్ ల విష‌యంలో ఇంచుమించు నాగ‌శౌర్య త‌ర‌హా ఆలోచ‌న‌ల‌తోనే ఉంటుంది. అందం కంటే..అభిన‌యంగా ర‌ష్మిక ఆక‌ట్టుకుంటుంది. నాగశౌర్య త‌ల్లితండ్రులుగా న‌టించిన న‌రేష్‌, ప్ర‌గ‌తి త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.

ఈ సినిమాలో పోసాని, ర‌ఘ‌బాబులు కూడా కీల‌క‌పాత్రలు పోషించారు. కాలేజీ లెక్చరర్‌గా పోసాని, ప్రిన్సిపాల్‌గా రఘుబాబు, స్టూడెంట్స్‌గా వైవా హర్ష, శీను, సత్య ప్రేక్షకులను ఫుల్ ఎంట‌ర్ టైన్ చేస్తారు. వెన్నెల కిశోర్‌ కామెడీ, మేన‌రిజ‌మ్స్ ఈ సినిమాకు ఓ హైలెట్ గా నిలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా స‌క్సెస్ అయ్యార‌ని చెప్పొచ్చు. మ్యూజిక్‌ పరంగా మణిశర్మ తనయుడిగా మహతి సక్సెస్ సాధించిన‌ట్లే. సినిమాలో పాట‌లు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చూసి చూడంగానే పాట సూప‌ర్ స‌క్సెస్. లాజిక్ లు వెత‌క్కుండా ఛ‌లో సినిమాను చూస్తే సూప‌ర్ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. క‌థ కంటే సినిమాలో కామెడీనే హైలెట్. ఛ‌లో ద్వారా నాగ‌శౌర్య ఓ హిట్ అందుకున్న‌ట్లే.

రేటింగ్. 3.25-5

Next Story
Share it