Telugu Gateway
Politics

చంద్రబాబుపై కేసుకు..అదొక్కటి చాలు

చంద్రబాబుపై కేసుకు..అదొక్కటి చాలు
X

‘నేనేం తప్పు చేశాను. నేనెందుకు భయపడతాను. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనే లేదు.’ ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నాడు అమరావతిలో జరిగిన ఎంపీల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. నిజంగానే చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదా?. అసలు కేంద్రానికి భయపడాల్సిన అవసరమే లేదా?. అంటే అదంతా ప్రజలను నమ్మించటానికే అని ఏపీకి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దక్కించుకున్న టెండర్ ను రద్దు చేసిన అంశం ఒక్కటి చాలు ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు పెట్టడానికి అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యధిక విమానాశ్రయాలు నిర్వహించే ఏఏఐ పోటీ బిడ్డింగ్ లో పాల్గొని మరీ దక్కించుకున్న తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టు కూడా ఇదే. సర్కారు టెండర్ పిలిస్తే ఏఏఐ బిడ్ వేసింది తప్ప..అదేమీ నామినేషన్ మీద ఇచ్చింది కాదు. ప్రైవేట్ సంస్థ జీఎంఆర్ కంటే ఎంతో బెటర్ ఆఫర్ ఇచ్చినా అక్కడ ఏమీ కమిషన్లు రావనే ఉద్దేశంతో భూసేకరణ పూర్తి కాలేదనే కారణం చూపి టెండర్ రద్దు చేశారు.

అసలు భూ సేకరణ పూర్తి కాకుండా టెండర్ ఎలా పిలిచారు? అన్న సందేహలకు ఎవరు సమాధానం చెబుతారు?. ఇది ఒక్కటేనా అంటే..ఇదే కాదు. విభజన చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధానిలో రాజ్ భవన్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, సెక్రటేరియట్ వంటి నిర్మాణాల కోసం కేంద్రం 1500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఇందులో 1583 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు వినియోగపత్రాలు నీతి అయోగ్ కు సమర్పించింది సర్కారు. ఏపీలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారు కానీ..రాజధానిలో శాశ్వత భవనాలకు సంబంధించి అసలు ఇంత వరకూ పూర్తి స్థాయి డిజైన్లే రాలేదు. మరి అలాంటప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులతో ఏపీలో రాజధాని కట్టేసినట్లు ఎలా చూపిస్తారు?. ఇది కేంద్రం కళ్లకు గంతలు కట్టడం కాదా?. కేంద్రం దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే పరిస్థితి ఏమి అవుతుంది?. పోలవరం గోల్ మాల్, ఫైబర్ గ్రిడ్ ఫ్రాడ్, అమరావతి కాంట్రాక్ట్ లు...ఇవి చాలవా కేంద్రానికి?. అయినా బాబు తప్పేమీ చేయలేదట.

Next Story
Share it