Telugu Gateway
Andhra Pradesh

ఏపీకి ‘విదేశాంగ శాఖ’ కావాలేమో!

ఏపీకి ‘విదేశాంగ శాఖ’ కావాలేమో!
X

అదేంటి?. విదేశాంగ శాఖ ఉండేది కేంద్రంలో కదా? అంటారా?. మామూలుగా అయితే అంతే. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ల విదేశీ పర్యటనలు, వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే అధికారులకు ఈ అనుమానం వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడినా కూడా సింగపూర్, అమెరికా, చైనా, జపాన్, కొరియా, జపాన్ ఇలా ప్రపంచంలో ఉన్న దేశాల పేర్లు అన్నీ చెబుతారు. అంతే కాదు ఏకంగా అమరావతికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం తరపున లండన్ లో ఓ కార్యాలయం పెడుతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు..ఆ కార్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు కూడా. మరి ఈ లండన్ నుంచి వచ్చిన పెట్టుబడులు ఎన్నో సర్కారే ప్రకటించాలి. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు విదేశీ పర్యటనలు చేస్తే చాలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వాటంతట అవే క్యూకట్టుకుని వస్తాయనే భ్రమింపచేస్తున్నారు ఏపీ ప్రజలను. తాజాగా దావోస్ పర్యటనకు అయితే చంద్రబాబు, లోకేష్ లతో పాటు మంత్రులు ఉన్నతాధికారులు వెళ్లారు.

అయితే ఈ పర్యటన ద్వారా ఖచ్చితంగా ఏ కంపెనీ ఏపీలో ఎంత పెట్టుబడి పెడుతుంది అని చెప్పే పరిస్థితి లేదు. గత ఏడాది డిసెంబర్ లోనే ఐటి శాఖ మంత్రి లోకేష్ పెట్టుబడుల కోసం అని అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. మళ్ళీ ఆ వెంటనే దావోస్ నుంచే మరోసారి అమెరికా వెళ్లారు పెట్టుబడులు సాధన కోసం. అంటే రెండు నెలల్లో రెండుసార్లు లోకేష్ అమెరికా లో పెట్టబడుల సాధన కోసం కృషి చేస్తున్నారట. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఎంవోయుల కోసం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనకు రెడీ అయిపోయారు. ఏపీలోని మంత్రులు..ఐఏఎస్ ల విదేశీ పర్యటనలు చూస్తుంటే రాష్ట్రానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవసరం అయ్యేలా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it