Telugu Gateway
Politics

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఔట్..జగన్ ఇన్!..రిపబ్లిక్ టీవీ సర్వే

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఔట్..జగన్ ఇన్!..రిపబ్లిక్ టీవీ సర్వే
X

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారాన్ని కోల్పోనుందా?. అంటే బిజెపి అనుకూల ఛానల్ గా ప్రచారంలో ఉన్న రిపబ్లిక్ టీవీ ఔననే చెబుతోంది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నిర్ణయానికి వస్తోంది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా..బిజెపి, తెలుగుదేశం పార్టీల కూటమికి 12 సీట్లు వస్తాయని అంచనా వేయగా...జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీకి 13 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తపిస్తున్న వైసీపీకి సానుకూల పరిణామంగా మారనుంది. ఎన్నికలకు ఇంకా ఎంత లేదన్నా ఏడాది సమయం ఉంది. ఈ లోగా ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప...తగ్గదు. ఈ లెక్కన చూసుకున్నా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఉన్నట్లు స్పష్టం అవుతోందని అంచనా వేస్తున్నారు.

రిపబ్లిక్ టీవీ సర్వే ఫలితాలు అధికార టీడీపీకి ఏ మాత్రం మింగుడుపడని పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత అనుకూల పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా ఏ మేరకు మార్చుకుంటుందో వేచిచూడడాల్సిందే. ఈ సర్వే ఫలితాల వివరాలను రిపబ్లిక్ టీవీ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేసింది. అన్ని రాష్ట్రాల వారీ వివరాలను టీవీ వెల్లడిస్తోంది. జగన్మోహహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సర్వే ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టినా అదే ఫలితాలు సహజంగా అసెంబ్లీలోనూ ప్రతిఫలిస్తాయి. కొన్ని మార్పులు ఉన్నా..చంద్రబాబుకు ఎదురుగాలి అనే విషయం మాత్రం రిపబ్లిక్ టీవీ సర్వే స్పష్టం చేస్తోంది. అయితే కాంగ్రెస్ తో పొత్తు ఉంటేనే ఈ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం మీద ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే విషయం ఈ సర్వే ద్వారా తేలింది. వైసీపీ, కాంగ్రెస్ జట్టుకడితే వచ్చే ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు ఈ కూటమికే వస్తాయని..అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను ఈ కూటమి భారీ ఎత్తున దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

Next Story
Share it