Telugu Gateway
Andhra Pradesh

పోల‌వ‌రం పంచాయ‌తీ ముగిసింది

పోల‌వ‌రం పంచాయ‌తీ ముగిసింది
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన వివాదం ప‌రిష్కారం. అయింది. మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ద‌గ్గ‌ర జ‌రిగిన కీల‌క‌భేటీలో ఈ స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం దొరికింది. న‌వ‌యుగా పాత‌రేట్ల‌కే స్పిల్ వే, స్పిల్ ఛాన‌ల్ ప‌నులు చేయ‌టానికి ముందుకొచ్చినా ఈ టెండ‌ర్ ద‌క్కించుకున్న ట్రాన్స్ స్ట్రాయ్ ప‌లు అనుమానాలు లేవ‌నెత్తి స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేసింది. దీంతో ఈ పంచాయ‌తీ ఢిల్లీకి చేరింది. ఈ భేటీలో అత్యంత కీల‌క‌మైన ప‌నుల‌ను న‌వ‌యుగాకు అప్ప‌గించేందుకు అంగీకారం కుదిరింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ట్రాన్స్ స్ట్రాయ్, న‌వ‌యుగాల మ‌ధ్య ఒప్పందం జ‌ర‌గ‌నుంది. దీంతో గ‌త కొంత కాలంగా నిలిచిపోయిన పోల‌వ‌రం ప‌నులు మ‌ళ్లీ వారం, ప‌ది రోజుల్లో ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి ఏపీ ప్ర‌భుత్వం ఈ ప‌నుల‌కు సంబంధించి భారీగా అంచ‌నాలు పెంచి మ‌రో కాంట్రాక్ట‌ర్ కు ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఈ టెండ‌ర్ ను కేంద్రం అడ్డుకుంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా విధిలేని ప‌రిస్థితుల్లో పోల‌వ‌రం ప్రాజెక్టులో అత్యంత ముఖ్య‌మైన స్పిల్ వే, స్పిల్ ఛాన‌ల్ ప‌నులు చేసేలా న‌వ‌యుగాను ఒప్పించిన‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చే న‌ష్టాన్ని న‌వ‌యుగాకు మ‌రో చోట స‌ర్దుబాటు చేయ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పోల‌వ‌రం అత్యంత కీల‌కం కానుండ‌టంతో ఎలాగైనా ప‌నుల‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చి దీని ద్వారా ల‌బ్దిపొందాల‌నేది టీడీపీ స‌ర్కారు యోచ‌న‌. ఈ దిశ‌గానే ప్ర‌స్తుతం ప‌రిణామాలు అన్నీసాగుతున్నాయి. అయితే మ‌రి ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు కోరుకుంటున్న‌ట్లు ఈ ప‌నుల వేగం ఏ మేర‌కు పెరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it