Telugu Gateway
Telugu

కెసీఆర్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు దక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి సీఎం కెసీఆర్ ను ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగానే కెసీఆర్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అంశంపై పవన్ తెలంగాణ సర్కారు తీరును కొనియాడారు. దేశానికే ఇది ఆదర్శం అని..ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఓ కేస్ స్టడీగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ కోసం గంట పాటు వెయిట్ చేసి మరీ పవన్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం పవన్ వ్యాఖ్యలు ఆయన మాట్లలోనే.."రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతరానుకున్నాను. కానీ ఇవాళ 24 గంటల విద్యుత్ ఇస్తుండటం ఆశ్చర్యమేస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది.. ఈ పాలసీని ఏవిధంగా అమలుచేశారన్న విషయాలను సీఎంను అడిగి తెలుసుకున్నాను. రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా చూసి ఆశ్చర్యపోయాను. సాధ్యం కాని పనిగా మిగిలిన 24గంటల విద్యుత్‌‌ను ఎలా ఇస్తున్నారు? ఎలా సాధ్యమైందన్న విషయాలపైనే ఎక్కువసేపు చర్చించాం.

ఇలా విద్యుత్ ఇస్తున్నందుకు కేసీఆర్‌ను మనస్పూర్తిగా కంగ్రాట్స్ చేయడానికే ఇక్కడికొచ్చాను" అని తెలిపారు. ఈ మధ్యే రాజ్‌భవన్‌లో కెసీఆర్ , తాను మాట్లాడుకున్నామని.. ఆ సందర్భంగా ఒకసారి కలవాలని కేసీఆర్‌ను కోరినట్లు వెల్లడించారు. సరైన సందర్భంలో కలుద్దామని కేసీఆర్‌ బదులిచ్చారు. అందుకే సోమవారం సాయంత్రం సీఎంను ప్రత్యేకంగా కలిశానన్నారు. "తెలుగు మహాసభలకు సమయం కుదరక రాలేకపోయాను. తెలంగాణలో నాకు అభిమానులున్నారు.. నా బలం నాకుంది. అదంతా డిఫరెంట్ ఎజెండా. హక్కుల సాధనకు కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకోవాలని ఏపీ నేతలకు చెబుతా. ఇప్పటికే పలుమార్లు ఏపీలో పర్యటించినప్పుడు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకోవాలనే విషయాన్ని ప్రస్తావించాను. ఈ సమావేశంలో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. పార్టీ పెట్టినప్పుడు చాలా మందినే కలిశాను. పరిచయం, సమస్యలపై అవగాహన పెంచుకోవడానికి నేను ఇలా అప్పుడప్పుడు పెద్దలతో భేటీ అవుతుంటాను. కేసీఆర్‌తో వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు ఇది కేవలం గుడ్‌ విల్ కోసమే"అని పవన్ స్పష్టం చేశారు.

Next Story
Share it