Telugu Gateway
Cinema

ప‌ద్మావ‌త్ మూవీ రివ్యూ

ప‌ద్మావ‌త్ మూవీ రివ్యూ
X

భార‌త‌దేశ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌గా వివాద‌స్ప‌దం అయిన సినిమా మ‌రొక‌టి లేదు. అదేంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని కూడా లేదు. ఎందుకంటే గ‌త కొన్ని నెలలుగా నిత్యం ఈ సినిమా వార్త‌ల్లో న‌లుగుతోంది. ఎన్ని నిర‌స‌న‌లు వ్య‌క్తం అయినా..దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు అనుమ‌తుల మేర‌కు దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానుంది. అదే ప‌ద్మావ‌త్. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ప్రివ్యూలు వేసేశారు. దీంతో అంద‌రిలో ఈ సినిమా ఎలా ఉంది అనే తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉంది. వారి కోసమే ఈ ప‌ద్మావ‌త్ రివ్యూ. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ సినిమా అద్భుత దృశ్యకావ్యం అని చెప్పొచ్చు. టేకింగ్ కానివ్వండి..విజువల్స్ కానివ్వండి ఎంత రిచ్ గా అంటే అంత రిచ్ గా ఉండి ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌న‌టంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది చారిత్ర‌క చిత్రం కావ‌టంతో ప‌ద్మావ‌తి గురించి అవ‌గాహ‌న ఉన్న వాళ్ల‌కు ఇది మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. చ‌రిత్ర గురించి తెలియ‌క‌పోయినా ఈ సినిమాను ఆస్వాదించ‌వ‌చ్చు.

ఇక సినిమాలోని అస‌లు క‌థ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు అల్లా ఉద్దీన్ ఖిల్జీ (ర‌ణ‌వీర్ సింగ్), ప‌ద్మావ‌తిగా (దీపికా ప‌డుకొనే), రాజ్ పుత్ వీరుడిగా షాహిద్ క‌పూర్ క‌న్పిస్తారు. అడ్డ‌దారుల్లో ప‌య‌నించే ఖిల్జీ అత్యంత అంద‌గ‌త్త అయిన ప‌ద్మావ‌త్ ను లొంగ‌దీసుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తాడు. మ‌రి ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా?. ప‌ద్మావ‌తి ఎలా ఖిల్జీ నుంచి త‌ప్పించుకోగ‌లిగింది అన్న‌ది వెండితెర‌పై చూడాల్సిందే. ఇక సినిమాలో పాత్ర‌ల విష‌యానికి వ‌స్తే కీల‌క‌పాత్ర‌దారులు అంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. ప్రతి అంద‌దమైన దానిమీదా అల్లావుద్దీన్‌ ఖిల్జీకి హక్కు ఉంటుంది అనుకునేంత వాంఛాపరుడు ఖిల్జీ. పెళ్లి రోజుకూడా పరస్త్రీని కోరుకునేంత విచ్చలవిడితనం ఉన్నవాడు. పిల్లనిచ్చిన మామను సింహాసనం కోసం చంపేసినవాడు. ఈ సినిమా చూస్తే రాజపుట్ లో ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి పూర్తి కంకణం కట్టుకుని తీసిన సినిమాలా అనిపిస్తుంది. పద్మావ‌తిగా దీపికా ప‌డుకొనే న‌ట‌న కూడా సూప‌ర్బ్. ఈ సినిమాలో ఫ‌స్ట్ రెండు పాత్ర‌ల గురించి చెప్పుకోవాలంటే అది ఖిల్జీ, ప‌ద్మావ‌తిదే.

భన్సాలీ అన్ని సినిమాల్లాగే సాంకేతికంగా గ్రాండ్‌గా ఉంది. విజువల్లీ సూప‌ర్ రిచ్‌. చివరి అరగంట సతీసహగమన ఘట్టంలో మాత్రం ప్రేక్షకుల‌కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాస్ట్యూమ్స్‌ ఈ సినిమాకు మేజర్‌ హైలైట్స్‌లో ఒకటి. భన్సాలీ సినిమాల్లో కాస్ట్యూమ్స్‌ వేరే లెవెల్‌ అనేలా ఉంటాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల‌కే ప్ర‌తి క్యారెక్టర్‌కూ కాస్ట్యూమ్స్‌ టాప్‌క్లాస్‌ ఉండేలా చూసుకున్నారు. కాస్ట్యూమ్‌ కలర్స్‌ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. టెక్నికల్‌ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఓవ‌రాల్ గా చూస్తే ప‌ద్మావ‌త్ సినిమా ప్రేక్షకుల‌కు ఓ మంచి అనుభూతిని మిగుల్చుతుంది.

Next Story
Share it