Telugu Gateway
Politics

ఓన్లీ....లోకేష్!

ఓన్లీ....లోకేష్!
X

ఏపీ ప్రభుత్వంలో హవా అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లదే అనే టాక్ ఉంది. ఇది కేవలం టాకే కాదు...అందులో చాలా వరకూ వాస్తవం కూడా ఉంది. ఈ ప్రచారానికి అనుగుణంగానే లోకేష్ వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజులకే సహచర మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా లోకేష్ వెయిట్ చేయించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఓ కొత్త విషయం వెలుగుచూసింది. ఐటి, పంచాయతీరాజ్ శాఖలు చూస్తున్న నారా లోకేష్ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఐదవ బ్లాక్ లో ఉంటారు. అక్కడే సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడుతోపాటు..మరో మంత్రి పరిటాల సునీత కూడా ఉంటారు. గత కొంత కాలంగా ఐదవ బ్లాక్ ముందు మంత్రి లోకేష్ కాన్వాయ్ తప్ప..మిగిలిన మంత్రుల కార్లు పెట్టనివ్వటంలేదని భధ్రతా సిబ్బంది చెబుతున్నారు. భద్రతా కారణాలతో మంత్రి సునీత కార్లతో పాటు సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు కార్లు కూడా పక్కన ఎక్కడైనా పెట్టుకోవాల్సిందే అని లోకేష్ భద్రతా సిబ్బంది హడావుడి చేస్తుండటంతో అవాక్కు అవటం వారి వంతు అయింది. పోనీ సందర్శకుల కార్లో..లేక ప్రైవేట్ కార్లు అయితే ఏమైనా సమస్యలు ఉంటాయనుకోవటంలో అర్థం ఉంటుంది. కానీ సహచర మంత్రులు..అందునా లోకేష్ కంటే ఎంతో ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న వారిని కూడా ఈ రకంగా అవమానించటం సరికాదనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచి విన్పిస్తున్నాయి.

వెలగపూడి సచివాలయంలో సందర్శకుల కార్లను అసలు లోపలికే అనుమతించటం లేదు. ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా కార్లను బయటే పార్క్ చేసుకోవాలి. ఇది తప్పు కాకపోయినా కేవలం సీఎం తనయుడు అనే ఏకైక కారణంతో లోకేష్ మిగిలిన మంత్రులను అవమానిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భద్రతా సిబ్బంది చేసే హడావుడితో మిగిలిన మంత్రులు చేసేది ఏమీ లేక పక్కన ఎక్కడో తమ మంత్రుల కార్లు పెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

Next Story
Share it