Telugu Gateway
Telugugateway Exclusives

నెల రోజుల్లో అక్కడ ఎండ 360 సెకన్లే

నెల రోజుల్లో అక్కడ ఎండ 360 సెకన్లే
X

ఆశ్చర్యపోతున్నారా?. అయినా సరే అదే నిజం. డిసెంబర్ నెలలో అక్కడ నేరుగా ఎండ ప్రసరించింది 360 సెకన్లే అంటే అవాక్కవ్వాల్సిందే. అవును మరి. ఇది ఎక్కడ అన్నదే కదా మీ సందేహం. రష్యా రాజధాని నగరం మాస్కోలో. 2017 డిసెంబర్ నెలలో కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే సూర్యకిరణాలు మాస్కో నగరాన్ని తాకాయని స్థానిక పత్రికల కథనం. అసలు ఎండ లేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి తరహా పరిస్థితినే మాస్కో 2000 డిసెంబర్ లో ఎదుర్కొంది. గత నలభై రోజుల్లో స్థానిక ప్రజలు ఈ జనవరి 11నే సూర్యరశ్మిని చూశారు. అంతే..ఇళ్లలో ప్రజలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ వేడిని ఆస్వాదించారు. చలి దేశాల్లో ఈ తరహా పరిస్థితులు కన్పిస్తూనే ఉంటాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.

ఎండ సంగతి అలా ఉంచి...మంచు వర్షాలతో రోడ్డుపై ప్రయాణం కూడా కష్టంగానే ఉంటుంది అక్కడి ప్రజలకు. శరీరానికి అసలు సూర్యరశ్మి తగలకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు అమెరికన్లతో పాటు పలు దేశాలకు చెందిన వారు ప్రత్యేకంగా భారత్ లోని గోవాతోపాటు పలు ప్రాంతాలకు వెళ్లి సన్ బాత్ చేస్తారు. వారి పర్యటనలు పూర్తిగా సూర్యరశ్మి కోసమే ఉంటాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. మనిషి ఆరోగ్యవంతంగా ముందుకు సాగాలంటే తిండితోపాటు సూర్యరశ్మి కూడా తప్పనిసరే. చాలా మంది ఇప్పుడు సూర్యరశ్మి తాకకే డీ విటమిన్ లోపంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Next Story
Share it