Telugu Gateway
Politics

కంభంపాటి ఏడాది టీఏ బిల్లు 70 లక్షలు

కంభంపాటి ఏడాది టీఏ బిల్లు 70 లక్షలు
X

అవాక్కు అవుతున్నారా?. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యులు కూడా అదే పని చేశారు మరి. ఎందుకంటే ఎంత విమానాల్లో తిరిగితే మాత్రం ఏడాదికి 70 లక్షల రూపాయల టీఏ బిల్లు అవుతుంది. తెలుగుదేశం సీనియర్ నేత, కంభంపాటి రామ్మోహన్ రావు కొద్ది కాలం క్రితం వరకూ ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన పీఏసీ కమిటీ ఏపీభవన్ ఖాతాలను కూడా పరిశీలించింది. అందులో కంభంపాటి రామ్మోహన్ రావు టీఏ బిల్లులను చూసిన కమిటీ సభ్యులు అవాక్కు అయ్యారు. ఢిల్లీ నుంచి అమరావతికి రోజూ తిరిగినా కూడా ఇంత మొత్తం కాదు కదా? అని ఓ సభ్యుడు వ్యాఖ్యానించారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోటు రాష్ట్రం..పేద రాష్ట్రం అంటూ అంటూ నిత్యం ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు.

చంద్రబాబు నుంచి స్పూర్తి పొందారే ఏమో కానీ కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ప్రత్యేక ప్రతినిధి హోదాలో కేవలం టీఏ బిల్లుల కోసం 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే మామూలు విషయంకాదని సభ్యులు విస్తుపోతున్నారు. పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ తిరిగి అదే పోస్టు దక్కించుకునేందుకు కంభంపాటి రామ్మోహన్ రావు విశ్వప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. రామ్మోహన్ రావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి మధ్య నెలకొన్న విభేదాలే ఆయనకు తిరిగి పోస్టు దక్కకపోవటానికి కారణం అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it