Telugu Gateway
Andhra Pradesh

భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దులో బోలెడు అనుమానాలు?

భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దులో బోలెడు అనుమానాలు?
X

విభజన తర్వాత సరైన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం లేని ఆంధ్రప్రదేశ్ కు కొత్త విమానాశ్రయం ఎంతో అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. అది కూడా విశాఖపట్నంకు చేరువలో కావటంతో ఏపీకి కనెక్టివిటి, ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరగటానికి ఇది దోహదపడుతుంది. గత ఏడాది ఆగస్టులోనే ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఈ విమానాశ్రయం టెండర్ దక్కింది. కానీ ఇప్పటివరకూ ప్రాజెక్టు కేటాయించకుండా...ఏపీ కేబినెట్ శనివారం నాడు ఈ టెండర్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన కారణాలు విన్న వారు ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే.

ఆయన చెప్పిన అంశాలు మచ్చుకు కొన్ని. భూసేకరణ పూర్తి కాలేదు. కొత్తగా ఎయిర్ పోర్ట్ సిటీ, ఎంఆర్ వో ఫెసిలిటీలు ఏర్పాటు చేస్తాం. అన్నీ కలిపి మళ్లీ టెండర్లు పిలుస్తాం. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి?.

  1. భూ సేకరణ పూర్తి కాకముందే మరి ఏపీ సర్కారు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి టెండర్లు ఎలా పిలిచింది?
  2. 2050కి ప్రణాళికలు రూపొందించే అంత విజన్ ఉన్న సీఎం చంద్రబాబుకు ఏపీలో నిర్మిస్తున్న తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో చేపట్టాల్సిన కాంపోనెంట్స్ పై సరైన అవగాహన లేకుండా టెండర్లు ఎందుకు ఆహ్వానించారు?.
  3. సీఎం ఆమోదం లేకుండా చేస్తే అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకున్నారా?.
  4. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకి దక్కిన టెండర్లను ఏ కారణంతో రద్దు చేశారు?.
  5. ఎంఆర్ వో సౌకర్యం ఎంతో ట్రాఫిక్ ఉన్న హైదరాబాద్ లో కూడా అంత జోష్ గా ఏమీలేదు. అలాంటిది భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ట్రాఫిక్ పెరిగి..ఎంఆర్ వో ఊఫందుకోవాలంటే ఓ దశాబ్దంపైగానే పడుతుంది. దాని కోసం ఇప్పటి టెండర్లు ఎవరైనా రద్దు చేస్తారా?. ఎంఆర్ వో యూనిట్ ఏపీ తక్షణావసరమా?
  6. ఏపీ ప్రభుత్వం తాము అనుకున్న ప్రైవేట్ సంస్థకు టెండర్ రాలేదనే కారణంతోనే ప్రభుత్వ రంగ సంస్థ ఏఏఐ టెండర్ ను రద్దు చేయటం వాస్తవం కాదా?.
  7. ఏఏఐకి దక్కిన టెండర్ ను రద్దు చేయటం ద్వారా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును ఏపీ సర్కారు అవమానించినట్లు కాదా?

Next Story
Share it