Telugu Gateway
Telugu

అట్టహాసంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు అట్టహాసంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు వేడుకలకు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన లేజర్ షో, బాణా సంచా వెలుగులు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐదు రోజులు పాటు వివిద కార్యక్రమాలతో తెలుగు మహాసభలు విజయవంతంగా సాగాయి. తొలి రోజు ఉప రాష్ట్రపతి, చివరి రోజు రాష్ట్రపతి ఈ మహా సభల్లో పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో మాట్లాడిన రాష్ట్రపతి కోవింద్ తెలుగు భాష ప్రాధాన్యత మరవలేనిదన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...‘‘సజీవ భాష తెలుగు. ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మహత్తర దేశ పురోగతిలో తెలుగు వారి పాత్ర ఎనలేనిది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు బిడ్డల కృషి మహత్తరమైనది. దేశ సాహిత్యంలోనే గాక మానవ నాగరిక పరిణామ క్రమంలోనూ తెలుగు భాషకు విశిష్ట స్థానముంది. ఈ భాషా ప్రావీణ్యం ఖండాంతరాలు దాటి గొప్పగా వర్ధిల్లుతూ, తనకు ఎల్లలు లేవని నిరూపించింది. తెలుగువారు దేశ సరిహద్దులు దాటుకు వెళ్లి ప్రపంచ పురోగతిలో తమదైన ముద్ర వేస్తున్నారు.

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈఓగా గొప్పగా రాణిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్లే ఇందుకు నిదర్శనం’’అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా ఖ్యాతి పొందిన తెలుగు మున్ముందు మరింతగా తేజరిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ఖ్యాతిని సుస్థిరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించిందని ప్రశంసించారు. ’‘42 దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు సభలకు తరలి వచ్చారని తెలిసి అబ్బురపడ్డాను. ఈ ఐదు రోజుల పండుగలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. చెప్పారు. తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలను ప్రారంభించటం సంతోషాన్నిచ్చింది.

ఐదు రోజుల పండుగతో మహత్తర తెలుగు భాషకు జనం ఘనంగా నీరాజనం పలికారు’’అంటూ అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మాతృభాష అయిన తెలుగు 2008లో ప్రాచీన హోదా కూడా పొందిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను ప్రస్తుతిస్తూనే తనదైన చలోక్తితో సభికులను ఆకట్టుకున్నారు రాష్ట్రప్రతి. ‘‘హైదరాబాద్‌ అంటే... బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి గుర్తొస్తాయి. ఇక్కడి వంటలు ఎంతో ప్రీతిపాత్రమైనవి. హైదరాబాద్‌ వంటకాలకు ఢిల్లీలో ఎంతో పేరుంది. ముఖ్యంగా ఇక్కడి పచ్చళ్లు అక్కడి వారికెంతో ఇష్టం. క్రీడారంగంలో ఉత్తమ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను హైదరాబాద్‌ అందిస్తోంది. సినీ రంగానికి బాహుబలి వంటి గొప్ప సినిమాను అందించిందని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రసంగం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

Next Story
Share it