Telugu Gateway
Andhra Pradesh

పోలవరంలో ‘చీటింగ్ చంద్రబాబుదే’

ఇదిగో ఆధారం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చూస్తూ ఊరుకుంటారా?. పోలవరం ప్రాజెక్టు అమలును రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టినా..అందులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా ఖచ్చితంగా తమ అనుమతి తీసుకోవాలని కేంద్రం ఎప్పుడో స్పష్టం చేసింది. కానీ ఈ విషయాలన్నీ దాచేసి పోలవరం ప్రాజెక్టును ఆపమని కేంద్రం ఆదేశించిందని సర్కారు గగ్గోలు పెడుతోంది. అయితే వాస్తవ విషయాలను మరుగున పెట్టి అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకు సాగుతున్నది రాష్ట్ర ప్రభుత్వమే అని స్పష్టమైంది. ఎలాగూ మొదట చెప్పినట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం సాధ్యంకాదు కాబట్టి ..కేంద్రంపై ఆ నెపాన్ని నెట్టేందుకు చంద్రబాబు అండ్ కో పక్కాగా ప్లాన్ చేసినట్లు ఈ లేఖతో బహిర్గతం అయింది. ఈ లేఖ చూసిన తర్వాత అసలు వాస్తవం ఏమిటి?. తప్పు కేంద్రానిదా?.రాష్ట్ర ప్రభుత్వానిదా?. అంటే ఉల్లంఘన ఖచ్చితంగా ఏపీ వైపు నుంచే జరిగిందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన లేఖలను కూడా వీరు చూపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సైట్ లో చిన్న మార్పులు చేసినా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతి తీసుకోవాల్సిందే అని 2015 సెప్టెంబర్ 8నే కేంద్రం ఏపీ సర్కారుకు రాసిన లేఖలో విస్పష్టంగా పేర్కొంది. ఈ లేఖ పోలవరం ఈఎన్ సీ దగ్గర నుంచి ఉన్నతాధికారుల అందరి దగ్గరా ఉంది.

పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున..అందులో చేసే ఎలాంటి మార్పులు అయినా కేంద్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా పీపీఏ అనుమతితోనే ఎలాంటి మార్పులు అయినా చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతుంటే ఏపీ సర్కారు మాత్రం ప్రస్తుత కాంట్రాక్టర్ కు 60 సీ కింద నోటీసు ఇచ్చి స్పిల్ వేతో పాటు ఇతర పనుల కోసం కొత్తగా 1400 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. దీనికి పీపీఏ అనుమతి లేదు. ఇదే కారణంతో కేంద్రం ఆపమన్నదే తప్ప..ఇందులో అసలు ఎలాంటి వివాదం లేదని సాగునీటి శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వం..తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం మోపుతుందని..కావాలనే ఈ ప్రాజెక్టు వ్యవహారాన్ని సంక్లిష్టం చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ విషయంలో..ఏపీ సర్కారు తీరుపై సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం ఏమి కావాలన్నా చేయటానికి సిద్దంగా ఉన్నామని..ఉల్లంఘించి అడ్డగోలుగా చేస్తామంటే కుదరదని కేంద్ర అధికారుల వాదన.

Next Story
Share it