Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు పాలనలో జగన్ అవినీతి కనిపెట్టిన పవన్

దేశంలో రాజకీయాలకూ ‘కాల్షీట్లు’ ఇచ్చినట్లు ఇచ్చి రాజకీయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?. అంటే అది ఖచ్చితంగా జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్’ అని చెప్పొచ్చు. పార్టీ పెట్టి..వేరే పార్టీలకు మద్దతు ఇవ్వటం కూడా ఓ అరుదైన ఘటనే. అన్నింటి కంటే విచిత్రం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలనలో ‘జగన్ అవినీతి’ కనిపెట్టారు. వైఎస్ జమానాలో సాగిన అవినీతి వ్యవహారాలను ప్రధాన పత్రికలు అన్నీ అప్పట్లోనే పెద్ద ఎత్తున ఎత్తి చూపాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సీబీఐ కేసులు నమోదు అయ్యాయి..జగన్ వాటిని ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు పాలనలో పవన్ కళ్యాణ్ జగన్ అవినీతి గురించి వెలికితీయటం. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అక్రమాలకు పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటింది కానీ ఇప్పటివరకూ ఏ రంగంలోనూ ఒక్కరంటే ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

పైగా టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా పలు ఆధారాలు ఉన్నాయంటూ రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించింది. మరి అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకుని టీడీపీ సర్కారు కానీ..చంద్రబాబు కానీ ఎందుకు ఒక్కరిపై చర్య తీసుకోలేకపోయారు?. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించలేకపోయారు. అంటే అప్పటి వారి అవినీతికి బదులుగా తాము ఇఫ్పుడు చేసుకుంటామని వదిలేసుకున్నారా?. అవినీతికి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఊరుకోవటం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు కాదా?. పైగా ఎప్పుడో జరిగిపోయిన అవినీతి గురించి ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబు జమానాలో సాగునీటి ప్రాజెక్టులు..పరిశ్రమలు, అమరావతి పేరుతో సాగుతున్న భారీ దోపిడీ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించటం లేదు. పవన్ కళ్యాణ్ నిజంగా ఫీల్డ్ లో దిగితే ప్రస్తుత అవినీతిని అడ్డుకోవచ్చు కదా?. మరి ఆ పని వదిలేసి...పత్రికల్లో విస్తృతంగా వచ్చిన, అందరికీ తెలిసిన వైఎస్ జమానా అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించి..ప్రస్తుత ప్రభుత్వంలోని అవినీతి గురించి అలా ఓ ముక్క మాట్లాడి వదిలేయటం వెనక మతలబు ఏమిటి?. అవినీతి ఎవరు చేసినా ఒకటే కదా?.మరి జగన్ కు ఓ రూల్..చంద్రబాబుకు ఓ రూల్ ఎందుకు పవన్ కళ్యాణ్?.

Next Story
Share it