Telugu Gateway
Andhra Pradesh

రాజమౌళిపై పరకాల పేషీ నుంచి దుష్ప్రచారం

‘ఆయన ప్రభుత్వం పిలిస్తే వెళ్లారు. డిజైన్లలో సహకారం కావాలంటే ఇచ్చారు. తన పని మానుకుని రెండుసార్లు లండన్ వెళ్లారు. మరికొన్నిసార్లు అమరావతి వెళ్లారు. అయినా సరే తాను సూచించిన డిజైన్లు ఏమీ ఆమోదం పొందలేదని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. తనది చాలా చిన్న సాయం’ అంటూ హుందాగా వెళ్లిపోయారు. ఆయనే టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. తన డిజైన్లు ఆమోదించకపోయినా..రాజమౌళి తన వంతు సాయం కింద పలు ప్రతిపాదనలు అందించారు. అందులో ఒకటి నూతన అసెంబ్లీలో తెలుగుతల్లి విగ్రహాం ఒకటి పెట్టి ..ఆ విగ్రహంపై అరసవిల్లి దేవాలయంపై సూర్యకిరణాలు పడినట్లు పడే వీడియో ఒకటి రూపొందించారు. ముందు తెలుగు తల్లి పాదాలను తాకే వెలుగులు..తర్వాత తల వరకూ వెళతాయి. అనంతరం అసెంబ్లీ నలువైపులా వెలుగులు వచ్చేలా డిజైన్ చేశారు. ఇది గురువారం నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఈ తెలుగుతల్లిపై సూర్యకిరణాలు పడే వీడియో వ్యవహారంపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పేషీ నుంచే దుష్ప్రచారం మొదలైంది. పేషీ నుంచి కొంత మంది అధికారులకు మెసెజ్ వెళ్లింది. ఇందులో రాజమౌళి సృజనాత్మకత ఏమీలేదని..ఇది కూడా కాపీయే అంటూ పోస్టులు పెట్టారు. అంతే కాదు..మీడియాకు సమాచారం అందించే ఓ గ్రూపులోనూ ఈ మెసెజ్ పెట్టారు. వెంటనే పొరపాటు చేశామని గ్రహించి ఈ మెసెజ్ ను వెంటనే డిలీట్ చేశారు. ఇది అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ వైపు సీఎం ఆఫీసులో పనిచేస్తూ..ఇలా ప్రభుత్వం ఆహ్వానించిన వ్యక్తిపై ఇలా దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it