Telugu Gateway
Telugu

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

పారిశ్రామిక రంగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) మరోసారి నిరాశపర్చింది. ఎప్పటినుంచో పారిశ్రామిక రంగం వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా కోరుతోంది. ఆర్ బీఐ తన తాజా పరపతి విధానంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యధాతధ స్థితిని కొనసాగించింది. అయితే ఈ సారి కూడా ఆర్ బిఐ మరో ‘సారీ’నే చెబుతుందని ఎక్కువ మంది అంచనా వేశారు. ఆ అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా 6 శాతంగానే కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆధ్వర్యంలో రెండు రోజులు సమావేశమైన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం రెపోరేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి వద్ద ఉంది.

ఆగస్టు నెలలో తగ్గింపు నిర్ణయం అనంతరం ద్రవ్యోల్బణం భయాల పేరుతో రెపోరేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ట స్థాయి 3.59 శాతానికి, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ట స్థాయి 3.58 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే. ఆర్ బిఐ తాజా నిర్ణయంతో వడ్డీ రేట్ల తగ్గుదల కోసం పారిశ్రామిక రంగం ఎదురుచూడాల్సిందే. అయితే ద్రవ్యోల్బనం నియంత్రణలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఈ మేరకు ద్రవ్యోల్బణం జూలు విదిల్చినా పరిస్థితి అంతే.

Next Story
Share it