Telugu Gateway
Telangana

ఒకే వేదికపైకి కెటీఆర్, లోకేష్

హైదరాబాద్ లో ఈ నెల 23న ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ లు ఒకే వేదికపైకి చేరనున్నారు. టీవీ5 ఛానల్ ఈ నెల23న హైదరాబాద్ లోని హెఛ్ఐఐసీలో బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలోనే ఇద్దరు యువ మంత్రులు పాల్గొననున్నారు. వీరిద్దరూ కలసి ఒకే వేదికపై ఓ కార్యక్రమంలో పాల్గొననుండటం ఇదే మొదటిసారి. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసీఆర్ తన తనయుడికి అత్యంత కీలకమైన ఐటి, పరిశ్రమలు, మునిసిపల్ శాఖలను ఇవ్వగా...ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే తరహాలో తన తనయుడు నారా లోకేష్ కు ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు ఇచ్చారు. ఈ మధ్య మంత్రి కెటీఆర్ హైదరాబాద్ లో ఐటి రంగం ప్రగతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాత్రను కాదనలేమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చంద్రబాబు తీరును విమర్శించిన కెటీఆర్ అకస్మాత్తుగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించటం వెనక రాజకీయ కోణం ఉందనే విశ్లేషణలు వచ్చాయి.

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహా సభలకు అధికారికంగా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు స్వయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముగింపు సమావేశాలకు చంద్రబాబును కెసీఆర్ స్వయంగా పిలవాలని కోరారు. కానీ చంద్రబాబు మాత్రం తనను పిలవకపోయినా పర్వాలేదు అని..ప్రపంచ తెలుగు మహాసభలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అంతే కాదు..తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే తమ అభిమతం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇద్దరు యువనేతలు కెటీఆర్, లోకేష్ లు పాల్గొననుండటంతో అందరి చూపు దీనిపైపే ఉంది.

Next Story
Share it