Telugu Gateway
Telangana

అచణివేతలోనూ ఆగని కొలువుల కొట్లాట

ఓ వైపు కోర్టు అనుమతి. మరో వైపు పోలీసుల నిర్భందం..ఆంక్షలు. అయినా కొలువుల కొట్లాట ముందుకే సాగింది. అనుకున్న ప్రకారం సర్కారుకు పంపాల్సిన సందేశం పంపింది. అదే సమయంలో తెలంగాణ యువతకు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఉద్యోగాల కోసం ఎవరూ చావొద్దు..చచ్చేవరకూ పోరాడి అయినా ఉద్యోగాలు దక్కించుకుందాం అని వక్తలు ప్రకటించారు. కొలువుల కొట్లాట వేదికలో పోలీసుల పలు ఆంక్షలు అమలు చేశారని సభకు హాజరైన వారు తెలిపారు. అధికార టీఆర్ ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ సభకు మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో జిల్లాల నుంచి యువత రాకుండా సర్కారు ఆంక్షలు అమలు చేసింది. అయినా సరే యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు కొలువుల కొట్లాటకు. అయితే ఆశించిన స్థాయిలో రాకపోయినా వచ్చిన సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొలువుల కొట్లాట సభలో జెఏసీ ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ఆంక్షలకు ఆకాంక్షలు తలొంచవని, తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఉద్యోగాలను కూడా సాధించుకుంటామని ప్రకటించారు.

ఆకాంక్షలు యువతలో బలంగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో ఆయన మాట్లాడారు. నేరుగా టీఆర్‌ఎస్‌ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు.నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని విమర్శించారు. ‘‘రాజకీయ నిరుద్యోగుల సభ అని ఓ మంత్రి అంటే నవ్వు వస్తోంది. రాజకీయంలో నిరుద్యోగం ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగం కావాలని, పని ఇప్పించాలని అడగడం సిగ్గుపడే పనేమీ కాదు. మేం తప్పుడు పని చేస్తలేం. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చేదాకా వెనుకడుగు వేయం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ మేమే తెచ్చినమని కొందరు చెప్పుకుంటున్నరు. అమరుల ప్రాణాత్యాగాల ముందు వాళ్ల పని ఎంత? రాజకీయాల్లో ఉన్నవారే రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడితే ఎలా? అంటే వారు కూడా తప్పు చేస్తున్నట్టే కదా.

సమస్య ఏమన్నా చెబుదామంటే మంత్రులకే ముఖ్యమంత్రి దొరకడు. అలవైకుంఠపురంబులో.. ఏడు సముద్రాల ఆవల... అన్నట్టుగా మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ ఉండదు’’ అని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విద్యార్థులు, యువకులదేనన్నారు. ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్న ప్రభుత్వం... వాటిలో తెలంగాణవారికి ఎన్ని వచ్చాయో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు భాగస్వామ్యం లేని రాజకీయాలు నడవనీయబోమని, కొత్త సమాజాన్ని స్థాపిస్తామని స్పష్టంచేశారు.

Next Story
Share it