Telugu Gateway
Andhra Pradesh

ప్రపంచ తెలుగు సభలు అని...పక్క తెలుగు సీఎంనే పిలవలేదు

అవి ప్రపంచ తెలుగు మహాసభలు. కానీ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రికి కనీస ఆహ్వానం పంపలేదు. ఇదీ తెలంగాణ సర్కారు తీరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యక్తిగతంగా చేసిన యాగానికి మాత్రం పిలిచారు ఏపీ సీఎం చంద్రబాబును. చంద్రబాబు కూడా ఆంద్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కెసీఆర్ ను ఆహ్వానించారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పి దేశంలో ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎంను విస్మరించటం ఏ మాత్రం సరికాదని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణ తెలుగు సభలు అని పేరు పెట్టి ఉంటే..ఎవరూ అసలు దీనిపై మాట్లాడేవారే కాదని..ఏకంగా ప్రపంచ తెలుగు మహాసభలు అని పేరు పెట్టి..దేశ, విదేశాల్లో ఉన్న వారిని ఆహ్వానించి ..పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆహ్వానం పంపకపోవటం సరైన సంకేతం పంపినట్లు కాదని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పంపకపోవటం అనే అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

గతంలో తెలుగుతల్లిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కెసీఆర్..ఇప్పుడు పాత తెలుగుతల్లి చిత్రాన్ని పక్కన పెట్టి...తొలి రోజుల్లో తెలంగాణ తల్లిగా సిద్దం చేసిన చిత్రపటాన్ని ఈ సభల్లో వినియోగించారు. చంద్రబాబును ఈ సభలకు పిలవటంపై కొంత మంది మరో వాదన విన్పిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున మళ్లీ చంద్రబాబును కూడా పిలిస్తే ఇద్దరు ఏపీకి చెందిన వారు అవుతారని..ఇది తెలంగాణలోని తన వ్యతిరేకులకు ఓ అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రపంచ తెలుగు మహాసభలు అని పేరు పెట్టినప్పుడు మరో తెలుగు రాష్ట్ర సీఎంను విస్మరించటం సరికాదనే ఎక్కువ మంత్రి అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it