Telugu Gateway
Cinema

‘జవాన్’ మూవీ రివ్యూ

సాయి ధరమ్ తేజ్ హిట్ కోసం కసితో ఎదురుచూస్తున్నాడు. ఆయన కెరీర్ లో హిట్లు తక్కువ..సో సో సినిమాలే ఎక్కువ. సాయి ధరమ్ తేజ్, మెహరీన్ జంటగా నటించిన జవాన్, ఇంటికొక్కడు అనే సబ్ టైటిల్ తో వచ్చిన సినిమా శుక్రవారం నాడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సాయి కోరుకున్నట్లు హిట్ దక్కిందా? లేదా తెలుసుకోవాలంటే ముందుకు పోవాల్సిందే. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఓ స్కూలులో ఇద్దరు స్నేహితులు. వారిద్దరివీ భిన్నధృవాలు. ఒకరు ప్రాణం పోయినా సరే పొరపాటు చేయకూడదు అనుకునే తత్వం..మరొకరిది ఏమి చేసైనా కోరుకున్నది దక్కించుకోవాలనే మనస్తత్వం. వారిద్దరి మనస్తత్వాల ఆధారంగానే సినిమా తెరకెక్కింది. కథలో కొత్తదనం లేకపోవటం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా నిలుస్తుంది. ఇదే తరహా కథలు గతంలోనూ వచ్చాయి. సినిమా అంతా కూడా జై (సాయిధరమ్ తేజ్), కేశవ(ప్రసన్న) ల మధ్యే తిరుగుతుంది. కాస్తో కూస్తో కామెడీ ఉన్నా కూడా అది కూడా చిన్న పిల్లలతో చాలా పెద్ద మాటలు మాట్లాడి చేయించారు. జై ఎలాగైనా దేశ రక్షణ కోసం పనిచేయాలనే తపనలో భాగంగా డీఆర్ డీవో లో చేరతాడు. వందల కోట్ల రూపాయలు సంపాదించి..డబ్బుతో దేన్ని అయినా సరే కొనొచ్చు అనే ధీమాతో మాఫియాతో కలసి పనిచేస్తాడు కేశవ్.

డీఆర్ డీవోలో తయారు చేసిన ‘అక్టోపస్’ అనే అత్యాధునిక మిస్సైల్ లాంచర్ ను రక్షించే బాధ్యతను జై తీసుకుంటే..ఎలాగైనా అక్టోపస్ ను తస్కరించి మాఫియాకు విక్రయించటం ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు దక్కించుకోవాలని కేశవ ప్లాన్ చేస్తాడు. ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు..ఇందులో ఎన్ని మలుపులు ఉన్నాయనేది వెండితెరపై చూడాల్సిందే. ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే విలన్ గా నటించిన ప్రసన్న ముందు జై గా నటించిన సాయి ధరమ్ తేజ్ తేలిపోయాడు. విలన్ క్యారెక్టర్ లో ప్రసన్న ఎంతో అనుభవం ఉన్న నటుడిలా కూల్ గా చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడు. గత సినిమాలతో పోలిస్తే సాయిధరమ్ తేజ్ ఆకట్టుకున్నా ..విలన్ ముందు తేలిపోయినట్లు కన్పిస్తుంది. హీరో.. హీరోయిన్ ల మధ్య సాగిన రొమాన్స్ కూడా బోరింగ్ గా ఉందే తప్ప..ఎక్కడా ఫీల్ లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్ భారంగా నడిచినా..సెకండ్ హాఫ్ ను వేగంగా సాగుతుంది. సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ డైలాగు డెలివరి గత సినిమాలతో పోలిస్తే చాలా మెరుగైంది. పాటల్లో లొకేషన్లు రిచ్ గా ఉన్నా..ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హీరో సినిమా కాదు..విలన్ సినిమా.

రేటింగ్.2/5

Next Story
Share it