Telugu Gateway
Andhra Pradesh

జగన్ మరో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా!

ప్రతిపక్ష వైసీపీలో ప్రస్తుతం ఇదే చర్చ. రాజకీయాలు అన్నాక గెలుపు, ఓటమలు సహజం. కానీ అసలు రేస్ నుంచి పారిపోతే ఎలా?. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిని నిలపకపోవటం ఏ మాత్రం సరైన చర్య కాదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పోనీ బరి నుంచి తప్పుకున్నందున అధికార టీడీపీ ఏమైనా ప్రశంసలు కురిపిస్తుందా?. అంటే అదీ లేదు. అసలు జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడని..ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థిని పెట్టలేని స్థితిలో ఉన్నాడని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత అసలు వైసీపీ పార్టీనే ఉండదని టీడీపీ ఎదురుదాడి ప్రారంభించింది. టీడీపీ గెలిచిన తర్వాత అయినా ఇవే విమర్శలు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉండేదని..కానీ ఇప్పుడు ఎంతో ముందుగానే విమర్శలు ఎదుర్కోవాల్సి రావటంతోపాటు...అధికార పార్టీ డబ్బు వెదజల్లి గెలిచిందనే విమర్శలు చేసే అవకాశం లేకుండా చేసుకున్నట్లు అయిందని ఓ నేత వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే టీడీపీ డబ్బులు వెదజల్లుతుందా?. అంటే అదేమీ లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరి టీడీపీ డబ్బులు వెదజల్లుతుంది కదా?.అప్పుడు కూడా మరి మనం అభ్యర్ధులను నిలబెట్టకుండా ఉంటామా? అని ఓ వైసీపీ ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో డబ్బులు పెట్టడం అనేది ఏ పార్టీ అయినా ఇప్పుడు సహజం అయిపోయిందని..కాకపోతే ఒకరు ఎక్కువ..మరొకరు తక్కువ తప్ప..ఇందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభివృద్ధి పనుల హంగామాతోపాటు..భారీ ఎత్తున ప్రలోభాలకు గురిచేస్తుందని తెలిసి కూడా బరిలోకి దిగామని..మరి ఇప్పుడు అదే ఫార్ములాను ఎందుకు ఫాలో కాలేదో అర్థం కావటంలేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలతో పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని..ఇది కేడర్ కు ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే..అధికార పార్టీ మరోసారి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి వచ్చేదని...ఇప్పుడు అదీ లేదు..ఏదీ లేదు విమర్శలు మాత్రం తాము ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it