Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు సీట్ల లెక్కలు..టీడీపీలో కలకలం

‘నలభై నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదు. ఇదీ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పార్టీ నేతలతో చెప్పిన మాట. అంటే మిగిలిన 135 నియోజకవర్గాల్లో తిరుగులేదా?. అంటే ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉండదనే చెప్పొచ్చు. చంద్రబాబు లెక్కల్లోనే 40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పూర్. మరి వైసీపీ నుంచి చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో అందరికీ టిక్కెట్లు ఇస్తే అక్కడ ఉన్న టీడీపీ నేతలు చూస్తూ కూర్చుంటారా?. అధికార పార్టీలో ఉండి..ఇంత కాలం ఇన్ ఛార్జిలుగా ఉన్న వారు ఎంతో కొంత ఆర్థికంగాం బలపడి ఉంటారు కదా?. మరి ఎమ్మెల్యే కావాలన్న ఆశ వారిలో ఉండదా?. చంద్రబాబు మీకు టిక్కెట్ లేదు...వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే టిక్కెట్లు ఇస్తానన్నా ఏమీ మాట్లాడకుండా కూర్చుంటారా?. రాజకీయాల్లో అది సాధ్యం కాదు. చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మి ఎంత మంది మౌనంగా ఉంటారు. ఈ అంశాలన్ని ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ లు గా మారాయి. చంద్రబాబు లెక్కల ప్రకారమే 40 చోట్ల పార్టీ పరిస్థితి బాగాలేదు. ఆయన చెప్పకపోయినా వైసీపీ నుంచి వచ్చిన 22 మంది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా డిస్ట్రబెన్స్ ఉండటం సహజమే అని..ఈ లెక్కన 175 సీట్లు ఉన్న ఏపీలో 62 చోట్ల టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేనట్లే అని...చంద్రబాబునాయుడే అంగీకరించినట్లు అవుతుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. దీనికి తోడు జనసేన తో పొత్తు ఉంటుంది..ఆ పార్టీకి కూడా 30 నుంచి 40 సీట్ల మధ్య కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యకు పవన్ కూడా అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరి జనసేన కారణంగా సీట్లు కోల్పోయేవారి పరిస్థితి ఏమిటి?. ఎంత మందికి చంద్రబాబు పదవులు హామీ ఇవ్వగలరు?. ఎన్ని నెరవేర్చగలరు?. దీనికి తోడు ప్రభుత్వంపై సహజంగా ఎంతో కొంత ఉండే వ్యతిరేకత...ఇసుక దందా మొదలుకుని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అరాచకాలు కూడా భవిష్యత్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు వ్యాఖ్యలు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించేవిగానే ఉన్నాయని చెబుతున్నారు. పైగా చంద్రబాబు హామీల విషయంలో టీడీపీ ని నమ్ముకుని ఉన్న నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి..వైసీపీ నుంచి తెచ్చిన ఎమ్మెల్యేలతోపాటు ఇతర ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేయటంపై టీడీపీ నాయకులు..శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీనికి తోడు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రైతు రుణ మాఫీ అంశంపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని విషయంలో కూడా హామీ ఇచ్చిన విధంగా పనులు ముందుకు సాగకపోవటంపై ఏపీ ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు చెప్పిన లెక్కలు టీడీపీలో మాత్రం కాకరేపుతున్నాయి.

Next Story
Share it