Telugu Gateway
Andhra Pradesh

జనసేనను బిజెపిలోకలపాలని అమిత్ షా అడిగారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు సంచలన విషయాలు బహిర్గతం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలు అయిన కొద్ది రోజులకే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను బిజెపిలోకి ఆహ్వానించారని తెలిపారు. తనకు ఆ ఉద్దేశంలేదని చెప్పేసివచ్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయ పార్టీలదే హవా ఉంటుందని..ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించలేవని అమిత్ షా వ్యాఖ్యానించారన్నారు. ఏదో పార్టీలో విలీనం చేసేట్లు అయితే అసలు పార్టీ పెట్టడం ఎందుకు? అని ప్రశ్నించారు. సమాజం బాగుండాలనే కలతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆయన శనివారం నాడు ఒంగోలు జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తాను ఒక్కడినే బయలుదేరానని..ఒక్కడు కూడా కోట్ల మందిని మార్చగలడని ప్రకటించారు. చాలా మంది ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడటం లేదని అని ప్రశ్నిస్తున్నారని..తాను ఒక్కడిని ప్రశ్నించటానికి ..త్యాగం చేయటానికి రెడీ అని అంటూ..మీరు రెడీనా అని కార్యకర్తలను ప్రశ్నించారు.

ఇందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సిద్ధంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎప్పటిలాగానే పవన్ అభిమానులు సీఎం..సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మిగిలిన జిల్లాల్లో తన మాట విన్నారని..మీరు అల్లరి ఎక్కువ చేస్తున్నారని..అయినా తాను చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పే తీరుతానని ప్రకటించారు. మీరు సీఎం అంటే నేను పొంగిపోను. నా ఛాతీ ఏమీ పెరగదు. సీఎం కావటానికి చాలా అనుభవం కావాలి అని వ్యాఖ్యానించారు. పడవ ప్రమాదాలను ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా తీసుకుందని..ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే సరిపోతుందనే తీరు సరికాదన్నారు.రాజకీయ నేతల్లో సున్నితత్వం కొరవడుతుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it