Telugu Gateway
Andhra Pradesh

అవినీతి నిరోధక శాఖలో ‘అవినీతి’

అది అవినీతిని నిరోధించాల్సిన శాఖ. కానీ ఆ శాఖలోనే అవినీతి చోటుచేసుకుంటే?.. ఇప్పుడు అదే జరిగింది. ఎక్కడ అంటారా?. అవినీతి నిరోధానికి కాల్ సెంటర్ తో పాటు..ఎన్నో చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ లో. కొంత మంది అధికారుల అవినీతే సదరు అధికారికి ఓ వరంగా మారింది. ఏసీబీ ఎవరెవరిపై దాడి చేయనుందో ముందే వాళ్లకు లీకులు ఇచ్చి..ఆయా అధికారుల నుంచి సాయం పొందాడు ఈ అధికారి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏసీబీ రహస్య విభాగం మేనేజర్‌ శోభన్‌బాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అవినీతి అధికారులతో శోభన్‌బాబు కుమ్మక్కయి.. ముందుగానే ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి అందచేస్తున్నట్లు తాజాగా గుర్తించారు.

50 మందికి పైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్‌బాబుపై శాఖపరమైన విచారణకు ఏసీబీ డీజీ ఠాకూర్‌ ఆదేశించారు. కాల్‌డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదుచేశారు. గతంలో కూడా కొంత మంది భోగస్ వ్యక్తులు కూడా ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఉద్యోగులను భయపెట్టి భారీ ఎత్తున సంపాదించిన కేసులు కూడా ఉన్నాయి. అక్రమాలకు పాల్పడిన వారు అయితే ఎంతో కొంత సమర్పించుకుని..తప్పించుకునే వారు. అలాంటి వాటితో ఏ మాత్రం సంబంధం లేని వారు మాత్రం ఫిర్యాదు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఏసీబీలోని అధికారే అవినీతి అధికారుల కొమ్ముకాస్తూ అవినీతికి పాల్పడటం సంచలనంగా మారింది.

Next Story
Share it