Telugu Gateway
Andhra Pradesh

వెలగపూడి సచివాలయంలో ‘నిత్య రిపేర్ల వెలుగులు’!

రికార్డు సమయంలో వెలగపూడి సచివాలయ నిర్మాణం పూర్తి చేశాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాట. అద్భుతమైన టెక్నాలజీతో ఈ భవనాలు కట్టాం. ఇవి మంత్రి నారాయణ వ్యాఖ్యలు. అత్యవసరం పేరుతో టెండర్ లో కోట్ చేసిన ధర కంటే 50 కోట్ల రూపాయలుపైగా అదనపు మొత్తం చెల్లింపులకు ఆమోదం. మరి ఈ అద్బుతమైన టెక్నాలజీ చూసి వర్షాలు కూడా ఓ సారి టెస్ట్ చేద్దామనుకున్నాయో ఏమో కానీ..కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పలు బ్లాక్ ల్లో నీరు అలా జాలులా కారిపోయింది. అసెంబ్లీలోనూ అవే సీన్లు కన్పించాయి. పోనీ ఈ భవనాలు కట్టింది ఏమైనా చిన్నా..చితకా కంపెనీలా? అంటే అదీ కాదు. నిర్మాణ రంగంలో ఎంతో పేరున్న సంస్థలే. మరి ఎందుకు ఇలా వెలగపూడి సచివాలయం ‘నిత్య రిపేర్లతో వెలిగిపోతోంది’. అన్నది సచివాలయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు చేసినా నిర్మాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో చెప్పకనే చెప్పాయి.

ఇప్పుడు కూడా పలు బ్లాక్ ల్లో రిపేర్ల పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా శ్లాబు దగ్గర కార్మికులు తవ్వి..మళ్లీ నీళ్ళు లీక్ కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాక్ ల్లోనూ ప్రస్తుతం ఈ పనులు సాగుతున్నాయి. ఈ కొత్త సచివాలయ భవనాలు కట్టి నిండా ఏడాది మాత్రమే పూర్తయింది. అప్పుడే ఏకంగా శ్లాబుల్లోనే మార్పులు చేయాల్సిన పరిస్థితి. అన్ని బ్లాకుల్లో ఈ పనులు చేస్తుండటంతో మళ్ళీ సర్కారుపై కోట్ల రూపాయల భారం పడనుంది. సచివాలయంలో ప్రస్తుతం సాగుతున్న పనులు చూసి ఉద్యోగులు కూడా అవాక్కు అవుతున్నారు. కట్టినప్పటి నుంచి ఈ భవనాలు వివాదాల్లో మునిగితేలుతున్నాయి.

Next Story
Share it