Telugu Gateway
Latest News

పార్కింగ్ బాగాలేదని ఐదు వందల కోట్లు ఖర్చుపెడతారా?

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం నాడు కొత్త అసెంబ్లీ..సచివాలయ నిర్మాణ అంశాలపై హాట్ హాట్ చర్చ జరిగింది. సభ ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. వాస్తు పేరుతో కొత్త సచివాలయం నిర్మించడం కోసం వేల కోట్లు ఖర్చు చేసేందుకు ఆ డబ్బు కేసీఆర్ అబ్బ సొత్తుకాదని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్కింగ్ సరిగ్గా లేదనే కారణంతో రూ.500 కోట్లు వెచ్చిస్తారా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సిఎం కేసీఆర్ ఒక్కరే గంటలు గంటలు మాట్లాడుతన్నారని, ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ గౌడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆమె తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో ఒక్క యూనిట్ పవర్ కూడా ఉత్పత్తి కాలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి గతం తమ ప్రభుత్వం చేసిన ఘనతేనని తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక పనులే చేస్తున్నాయని..రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు కెసిఆర్‌దే భాద్యత అని అన్నారు.

Next Story
Share it