Telugu Gateway
Telugu

చెక్ బుక్స్ కు త్వరలోనే చెల్లు చీటి

పెద్ద నోట్ల రద్దు...జీఎఎస్టీతో దేశ ప్రజలకు షాక్ లిచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా?. అంటే అవునంటున్నాయి పారిశ్రామికవర్గాలు. త్వరలోనే చెక్కు లు చెల్లుబాటు కావని..బ్యాంకులు చెక్ బుక్స్ కూడా ఇఛ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచటమే. పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి మోడీ ‘డిజిటల్ ఎకానమీ’ గురించి పదే పదే ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే భారత్ చెక్ బుక్స్ లేకుండా పూర్తి స్థాయిలో డిజిటల్ ఎకానమీకి మారేందుకు అవసరమైన సన్నద్ధతతో ఉందా?. అంటే ఏ మాత్రం లేదని చెబుతున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. మరి మోడీ తాజా నిర్ణయం ఎన్ని సమస్యలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే. చెక్ బుక్స్ రద్దు విషయాన్ని ‘అఖిల భారత వ్యాపారుల సమాఖ్య’ (సిఎఐటి) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ ఓ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ లావాదేవీలు పెంచేందుకు మాస్టర్‌ కార్డు కంపెనీతో కలిసి ప్రారంభించిన డిజిటల్‌ రథ్‌ కార్యక్రమం ప్రారంభంలో ఖండేల్‌వాల్‌ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రూ.25,000 కోట్లు, వాటి రవాణా, భద్రత కోసం మరో రూ.6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దీనికి తోడు బ్యాంకులు క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై రెండు శాతం, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై ఒక శాతం చొప్పున వసూలు చేస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇస్తే, బ్యాంకులు ఈ చార్జిలు ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. చూడాలి ఈ సంచలన నిర్ణయం ఎప్పుడు ప్రజలపై పడుతుందో.

Next Story
Share it