Telugu Gateway
Andhra Pradesh

డీజీపీ పోస్టు...చంద్రబాబు ఓ వైపు..లోకేష్ మరో వైపు!

ఆంద్రప్రదేశ్ నూతన డీజీపి నియామక వ్యవహారం హాట్ హాట్ మారుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఏపీ అధికార వర్గాల్లో ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలాగైనా ప్రస్తుత ఇన్ ఛార్జి డీజీపీ సాంబశివరావును కొనసాగించాలని కోరుకుంటుండగా..ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ మాత్రం ఠాకూర్ ను ఈ పోస్టులో నియమించాల్సిందిగా గట్టిగా పట్టుపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఠాకూర్ కూడా కేంద్ర స్థాయిలో భారీ ఎత్తున లాబీయింగ్ చేసుకుంటారని..ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏడాది..ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు ఉన్నందున రాష్ట్రేతరుడు డీజీపీగా ఉండటమే కరెక్ట్ అని లోకేష్ వాదించినట్లు సమాచారం. అయితే ఏడాదిన్నరకుపైగా ఇన్ ఛార్జి డీజీపీగా కొనసాగించిన సాంబశివరావును తిరిగి రెగ్యులర్ డీజీపీగా నియమించాలని కోరుతూ ప్యానల్ పంపటంతో కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ఇంత కాలం ఆయన్ను పదవిలో ఉంచి..ఇప్పుడు ఆయన పేరు పంపటం ఏ మాత్రం సరికాదని..ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని ఘాటు లేఖ పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ అదే జాబితాను తిరిగి పంపటంతో..కేంద్రం మరింత సీరియస్ అయింది.

కొత్త జాబితా వచ్చే వరకూ అసలు ఈ పేర్లను పరిగణనలోకి తీసుకోవద్దని హోం శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ఒకరు ‘రాజ్యాంగబద్ద’ పదవిలో ఉన్న వ్యక్తి దగ్గరకు పోయి సాయం కోరటం..ఆయన హోం శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేయటం చకచకా సాగాయి. అయితే హోం శాఖ అధికారి మాత్రం ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీలేదని..ఏదైనా ఉంటే ప్రధాని మోడీతోనే మాట్లాడుకోవాలని ఆయన సమాధానం ఇవ్వటంతో దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఏపీ ప్రభుత్వం రెండవసారి పంపిన జాబితాను కూడా పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించటంతో ఈ నెల 22న జరగాల్సిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ) సమావేశం కూడా వాయిదా పడింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ పోరుపై ముగింపు ఏ మలుపు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it