Telugu Gateway
Telangana

కెటీఆర్ శాఖలో ‘అంతా రహస్యమే’

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కెటీఆర్ నిర్వహించే శాఖల్లో అత్యంత కీలకమైనది మునిసిపల్ పరిపాలనా శాఖ. ఆయనకు దీనితోపాటు ఐటి, పరిశ్రమలు, గనుల శాఖలు కూడా ఉన్నాయనుకోండి. కానీ అత్యంత కీలకమైన మునిసిపల్ శాఖలో పాలన ‘అంతా రహస్యం’గానే సాగుతోంది. దాదాపుగా ఏడాది కాలంగా మునిసిపల్ శాఖకు సంబంధించిన జీవోలు ఒక్కటి కూడా వెబ్ సైట్ లో పెట్టడం లేదు. 2017 సంవత్సరానికి సంబంధించి http://goir.telangana.gov.in లో కేవలం ఐదు అంటే ఐదు జీవోలు మాత్రమే ఉన్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి..మంత్రి కెటీఆర్ లు అసలు తమ ప్రభుత్వంలో అవినీతి..అక్రమాలకు తావే లేదని చెబుతుంటారు. మరి అంత పారదర్శకంగా చేసేటప్పుడు కీలక శాఖకు సంబంధించిన జీవోలను అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందన్న అంశం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే జీవో సైట్ ను కొంత కాలం ఆపేసి..అసలు ఏవి పెట్టాలి..ఏవి పెట్టకూడదు అనే అంశంపై నిర్ణయం తీసుకోవటానికి వీలుగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలు అయింది. అయితే జీవోల సైటు పనిచేస్తున్నా పలు కీలక శాఖల్లో అయితే భారీ ఎత్తున ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల జీవోలను కూడా నెట్ లో ఉంచటం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్ సర్కారు హయాంలో కూడా ప్రభుత్వం ఎప్పుడూ ఇలా చేయలేదు. కానీ మునిసిపల్ పరిపాలనా శాఖలో సాగుతున్న వ్యవహారంపై ఆ శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. శాఖలో కొంత మంది ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని...మంత్రి కెసీఆర్ కూడా వారికి అండగా ఉండటంతో ఆ శాఖలో ఇప్పుడు అంతా ‘రహస్య’ పాలన సాగుతోందని చెబుతున్నారు.

Next Story
Share it