Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు ఈడీ మరో ఝలక్

పాదయాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో ఝలక్. డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) తాజాగా వెలువరించిన జాబితాలో జగన్ పేరు కూడా చోటు చేసుకుంది. ఈడీ మొత్తం 12 పేర్లతో జాబితాను విడుదల చేయగా..అందులో జగన్ పేరు పదవ స్థానంలో ఉంది. డొల్ల కంపెనీల ఏర్పాటు ద్వారా అక్రమంగా కూడబెట్టిన డబ్బును విదేశాలకు తరలించి..మళ్ళీ అదే డబ్బును సొంత కంపెనీల్లోకి మళ్ళించటం చేస్తున్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు..రాజకీయ నాయకులు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. హవాలా మార్గంలో విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బులను తరలించారన్న ఆరోపణలు ఉన్నవారిపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టింది. ప్రస్తుతం 200 కోట్లకు పైగా మనీలాండరింగ్‌కు పాల్పడిన వారితో జాబితా రూపొందించింది. అందులో ఇద్దరే రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో ఒకరు ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కాగా... మరొకరు మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నాయకుడు చగన్‌ భుజ్‌బల్‌ ఉన్నారు.

జగన్‌తోపాటు ఆయన సంబంధీకులు 31 షెల్‌ కంపెనీల ద్వారా 368 కోట్లను హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఈడీ అంచనా వేసింది. చగన్‌ భుజ్‌బల్‌ 81 షెల్‌ కంపెనీల ద్వారా రూ. 200 కోట్లు విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ అవినీతితోపాటు... బంగారం, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవ్యతిరేక చర్యలతో సంపాదించిన సొమ్మునే హవాలా మార్గంలో దేశం దాటించినట్లు ఈడీ చెబుతోంది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, జైపూర్‌, జలంధర్‌, రాయ్‌పూర్‌, చెన్నై, పనాజీ నుంచి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరుగుతోంది. మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న 1000కి పైగా షెల్‌ కంపెనీలకు ఇటీవల ఈడీ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం ప్యారడైజ్ పేపర్లలో జగన్ కేసుల ప్రస్తావన రాగా..దీన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. అంతే కాదు..రాజకీయ సవాల్ కూడా విసిరారు. మరి తాజాగా వెలువడిన ఈడీ జాబితాపై జగన్ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it