Telugu Gateway
Andhra Pradesh

మెగా...బిఎస్ఆర్ కోసం ‘హైబ్రిడ్ మోడల్’ కు తూట్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా?. లేక కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారో అర్థం కావటంలేదని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీని వెనక బలమైన కారణం కూడా ఉంది. ఒక్కో టెండర్ కు ..ఒక్కో మోడల్. తాజాగా హైబ్రిడ్ యాన్యుటి విధానం (హెచ్ఏఎం) కొత్త పద్దతిని తెరపైకి తెచ్చారు. చివరికి ఆ పద్దతికి తూట్లు పొడిచారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్ డిఏ), అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) లో సాగుతున్న గోల్ మాల్ వ్యవహారాలు ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ మధ్య కాలంలోనే ఏపీసీఆర్ డిఏ ల్యాండ్ పూలింగ్ ఏరియాలో మౌలికసదుపాయాల కల్పన కోసం హైబ్రిడ్ యాన్యుటి విధానం (హెచ్ఏఎం) కొత్తగా తెరపైకి పనులు కేటాయించారు. కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఈ మోడల్ ను ఫాలో అవుతుంది. అయితే కేంద్రం ఫాలో అవుతున్న మోడల్ కూ ఏపీ సీఆర్ డిఏ తూట్లు పొడిచింది. అందులో భాగంగానే 4.10 శాతం ఎక్సెస్ తో 679కోట్ల పనులు మెగాకు కేటాయించారు. 3.94 శాతం ఎక్సెస్ తో 725 కోట్ల రూపాయల పనులను బిఎస్ఆర్ కు కేటాయించారు.

కేంద్రంలోని ఎన్ హెచ్ఏఐ మోడల్ అయితే మొత్తం ప్రాజెక్టులో 40 శాతమే ప్రభుత్వం సమకూరుస్తుంది. కానీ ఇక్కడకు వచ్చేసరికి ఈ వాటా ఏకంగా 49 శాతానికి పెరిగింది. ఇది కేవలం తమ అస్మదీయ కాంట్రాక్టర్లు మెగా, బిఎస్ఆర్ సంస్థలకు మేలు చేయటానికి చేసినట్లు కనపడుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం 40 శాతం ఇస్తుంటే..ఇక్కడ 49 శాతం ఇవ్వటంతో పాటు ప్రతి టెండర్ ను ‘ఎక్సెస్’కే కేటాయించారు. అంతే కాదు..ఏపీలో కొత్తగా ఈ ప్రాజెక్టుల్లోనూ పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద చెల్లించి..ఆ తర్వాత ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసుకోవాలని నిర్ణయించారు. సీఆర్ డీఏ లో జరుగుతున్న వేలాది కోట్ల రూపాయల పనుల ను పూర్తిగా ‘డిజైన్’ చేసి కేటాయిస్తున్నారనే విమర్శలు అధికార వర్గాల నుంచే విన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని సర్కారు అనుసరిస్తున్న విధానాలే నిరూపిస్తున్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ‘స్విస్ ఛాలెంజ్’ మోడల్ ఫాలో అయిన చంద్రబాబు సర్కారు..ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి పోటీ బిడ్డింగ్ మార్గంలో టెండర్లు పిలిచింది. ఇప్పుడు కొత్తగా అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన కోసం అస్మదీయ సంస్థలకు మేలు చేసేందుకు హైబ్రిడ్ యాన్యుటి విధానం తెచ్చి..దానికి తూట్లు పొడిచి ఆయా కంపెనీలకు మేలు చేయటానికి రెడీ అయిపోయింది.

Next Story
Share it