Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు సర్కారుకు కేంద్రం మరో షాక్..సంచలన వ్యాఖ్యలు

కేంద్రం చేతిలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ. అలా ఇలా కాదు..ఏకంగా సర్కారు తీరును కేంద్రం అభిశంసించిన చందంగా లేఖ రాయటం ప్రభుత్వ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు.అందులో పలు వ్యాఖ్యలు కూడా చేశారు. 2016 జులైలో జె వీ రాముడు డీజీపీగా పదవి విరమణ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఫుల్ టైమ్ డీజీపీని నియమించేందుకు మీకు సరైన వ్యక్తే దొరకలేదా? అని ప్రశ్నించారు. అంతే కాదు..ఇన్ ఛార్జి డీజీపీగా ఉన్న సాంబశివరావు పేరును కూడా పదవి విరమణ ముందు డీజీపీ ప్యానల్ లిస్ట్ లో పెట్టి పంపటంపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పదవి విరమణ సమయం ముందు కూడా సాంబశివరావు పేరును ప్యానల్ లో పెట్టడం అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇవ్వటమేనని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇన్ ఛార్జి డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈ డిసెంబర్ లో నే రిటైర్ కానున్నారు. ఆయన్ను ఎప్పుడో డీజీపీగా నియమించినా పోస్టును రెగ్యులర్ పోస్టుగా మార్చేందుకు ఆసక్తి చూపలేదు. దీని వెనక కూడా రాజకీయ కోణాలు ఉన్నాయని కేంద్రం గుర్తించినట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కేంద్రం సాంబశివరావు పేరుకు ఆమోదం తెలిపితే మరో రెండేళ్లు ఆయన పదవిలో కొనసాగే అవకాశం లభిస్తుంది. అంటే అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన సేవలను ఉపయోగించుకోవచ్చని ప్లాన్ చేసిందని..ఇందులో సామాజికపరమైన కోణాలు కూడా ఉన్నాయని కేంద్రానికి నివేదిక వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే కేంద్రం కూడా చంద్రబాబు సర్కారుకు ఝలక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం ఏ స్థాయిలో పర్యవేక్షిస్తుందో అనటానికి ఈ ఒక్క అంశం చాలు అని..రాబోయే రోజుల్లో కూడా పరిణామాలు మరింత దారుణంగా ఉండే అవకాశంలేకపోలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it