Telugu Gateway
Andhra Pradesh

బోటు నిర్వాహ‌కుడి డ‌బ్బు ఆశే ప్ర‌మాదానికి కార‌ణం

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బోటు ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం నాడు అసెంబ్లీలో ప్ర‌క‌టన చేశారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన బోటుకు అనుమ‌తిలేద‌ని తెలిపారు. నిర్వాహ‌కుడి డ‌బ్బు ఆశే ప్ర‌మాదానికి కార‌ణం అని పేర్కొన్నారు. స‌రైన భద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోకుండా ఎక్కువ మందిని ఎక్కించుకోవ‌టం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు కృష్ణానదిలో 20 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని సీఎం తెలిపారు. నదిలో గల్లంతైన బోటు డ్రైవర్‌, హెల్పర్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఘటనలో బాధితులు నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో బోటులో 41మంది ఉన్నారని చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఆరు బృందాలు పాల్గొన్నాయని అన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని.. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రతిని సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదుచేశామని తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన . రివర్‌ బోటింగ్‌ సంస్థపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో పలువురు చనిపోవడం చాలా బాధ కలిగిస్తున్నదని, ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షిస్తామని చెప్పారు. భద్రతా ప్రమాణాలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని చెప్పారు. ఈ ప్రమాదాన్ని చూసిన వెంటనే స్పందించి.. ఆపదలో ఉన్నవారిని కాపాడిన స్థానికులను చంద్రబాబు అభినందించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మృతులకు సంతాపం తెలుపుతూ.. సభ రెండు నిమిషాలపాటుమౌనం పాటించింది.

Next Story
Share it