Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘మెగానుభావుడు’

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఈ మధ్య ఓ ఉన్నతాధికారి ‘మెగానుభావుడు’ అని వ్యాఖ్యానించారు. అంటే అధికారుల్లో ఈ బంధంపై ఎలాంటి అభిప్రాయం ఉందో ఊహించుకోవచ్చు. ఊహించని రీతిలో కేంద్రం కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన ‘మెగా ప్లాన్’కు బ్రేక్ లు వేసింది. ఇది సర్కారులో తీవ్ర కలకలం రేపుతోంది. సరిగ్గా రెండు నెలల క్రితం వరకూ ‘పోలవరం పరుగులు..ఉరుకులు’ అంటూ ఊదరగొట్టిన సర్కారు..కేంద్రం జోక్యం ప్రారంభం అయినప్పటి నుంచి ఫ్లేట్ ఫిరాయించింది. అసలు కాంట్రాక్టర్ కు పనిచేసే సత్తాలేదనే విషయాన్ని ఏపీ సర్కారు కూడా నిన్నమొన్నటి వరకూ పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ సత్తా విషయం దేశంలో అందరికీ తెలిసినా..ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియలేదంటే ఎవరైనా నమ్ముతారా?. అందుకే కేంద్రం కూడా పోలవరం పేరుతో సాగుతున్న దందాలపై చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే కొత్తగా పిలిచిన టెండర్లకు బ్రేకులు వేసింది. 1395 కోట్ల రూపాయల పనులకు టెండర్లు దాఖలు చేసేందుకు అంత తక్కువ సమయం ఎలా ఇస్తారంటూ కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజంగా ఏపీ సర్కారులో..ఏపీసీఆర్ డీఏలో సాగుతున్న టెండర్ల వ్యవహారం చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. కేంద్రం నుంచి అందుతున్న తాజా సంకేతాలు చూస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు మరింత సంక్లిష్టంగా ఉండే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కేంద్రం నుంచి అందిన లేఖపై చంద్రబాబు అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు. ఈ ఏడాది అక్టోబరు 13న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన సమావేశం స్ఫూర్తికి భిన్నంగా ఈ టెండర్లను పిలిచారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 22వ తేదీ నాటికి కూడా ఈ-టెండరు నోటీసు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించలేదని తెలిపారు. పైన పేర్కొన్న అంశాలన్నింటిని పరిగణనలోనికి తీసుకుంటే.. టెండరు ప్రకియను కొనసాగించడం సరికాదన్నారు. పై అంశాలన్నీ పరిష్కారమయ్యే వరకు టెండర్‌ ప్రక్రియను నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వ స్పీడ్ కు బ్రేకులు పడినట్లు అయింది. ట్రాన్స్ స్ట్రాయ్ ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించటానికి కేంద్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది.

Next Story
Share it