Telugu Gateway
Andhra Pradesh

రాజమండ్రి టీడీపీ ఎంపీ సీటు ఈ సారి బీఎస్ఆర్ కే!

రాజమండ్రి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ కు ఈ సారి చెక్ పడనుందా?. ఆయనకు టీడీపీ అధిష్టానం ఈ సారి ఎంపీ సీటు ఇవ్వదా?. అంటే అవునంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలు..కాంట్రాక్టర్లతో నిండిన తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు మరో బడా కాంట్రాక్టర్ ప్రవేశిస్తున్నారు. ఇటీవల వరకూ బెంగుళూరు కేంద్రంగా భారీ ఎత్తున కాంట్రాక్ట్ లు చేస్తున్న బలుసు శ్రీనివాసరావు (బీఎస్ఆర్) ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సారి మురళీమోహన్ ను పక్కకు తప్పించి...బీఎస్ ఆర్ కు ఈ సీటు ఇస్తారని టీడీపీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీఎస్ ఆర్ గత ఎన్నికల ముందు నుంచి టీడీపీ అధినేత,, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సన్నిహితంగా ఉంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి పెద్ద ఎత్తున ఆర్థికంగా సాయం కూడా చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు ఆయనకు రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు దక్కతున్నాయి. కాంట్రాక్టులు ఒక్కటే కాదు..ఏకంగా ఎంపీ సీటు కూడా ఇవ్వటానికి చంద్రబాబు రెడీ అయిపోయారని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

దీనికి ప్రధాన కారణం ఇక ఆ ఎంపీ నియోజకవర్గంలో చంద్రబాబు ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదని చెబుతున్నారు. అంత భారీ ఎత్తున ఆయన డబ్బు పెట్టగలరని..అందుకే చంద్రబాబు ఈ సారి బీఎస్ఆర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మురళీమోహన్ గత కొంత కాలంగా చురుగ్గా ఉండటం లేదు..అయితే ఆయన తరపున నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు ఆయన కోడలే చక్కపెడుతోంది. దీంతో ఆమె సీటు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం రాజమండ్రి సీటును బీఎస్ఆర్ కే ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it